27-11-2025 12:23:42 AM
సైబరాబాద్ సైబర్ క్రైం బృందం ప్రత్యేక ఆపరేషన్
శేరిలింగంపల్లి, నవంబర్ 26 (విజయక్రాంతి): సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దేశవ్యాప్తంగా సైబర్ మోసగాళ్ల గుంపును అట్టడుగునుండి బయటకు లాగారు. ప్రత్యేక ఆపరేషన్లో పది కీలక కేసులను ఛేదిస్తూ వివిధ రాష్ట్రాల్లో మొత్తం 21మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో 13 మంది ట్రేడింగ్ మోసాలు, ఏడుగురు డిజిటల్ అరెస్ట్ దందాలు నడిపినట్లు నిర్ధారించగా, నిందితుల వద్ద నుంచి 21 మొబైల్ ఫోన్లు, 24 సిమ్లు, ఒక ఎటిఎం కార్డు, ఒక చెక్కుబుక్ స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్ర్ంైస డీసీపీ వై.వై.ఎస్. సుధీంద్ర తెలిపారు.
ఇంకా, ఇప్పటి వరకూ 49 కేసుల్లో బాధితులకు తిరిగి చెల్లింపుల కోసం 163 రిఫండ్ ఆర్డర్లు పొందామని, మొత్తం రూ.89,77,329 తిరిగి ఇవ్వనున్నట్లు వివరించారు.70 లక్షలు లాక్కున్న డిజిటల్ అరెస్ట్ గ్యాంగ్ను కేరళలో పట్టుకున్నారు. ఒక రిటైర్డ్ వృద్ధుడిపై బెదిరింపులతో రూ.70 లక్షల మోసం చేసిన గ్యాంగ్ను కూడా సైబరాబాద్ పోలీసులు ఛేదించారు.
బాధితుడికి వాట్సా ప్ కాల్ చేసి ఢిల్లీ పోలీస్ అధికారిగా నటించిన వ్యక్తి, తర్వాత వీడియో కాల్లో సైబర్ క్రైం, సిబిఐ అధికారిగా నటించిన మరో వ్యక్తి విచారణ పేరుతో ఒత్తిడి చేసి బ్యాంకు వివరాలు రాబట్టారు. భయంతో బాధితుడు తన ఫిక్స్‌డ్ డిపాజిట్లను తెచుకొని రూ.70 లక్షలు ‘ఆర్బిఐ వెరిఫికేషన్’ పేరుతో పంపించాడు. స్పందన రాకపోవడంతో మోసపో యిన విషయం గ్రహించి ఫిర్యాదు చేయగా, కేరళ ఆపరేషన్లో మోయినుద్దీన్ ఎకె, విపిందాస్, రియాస్ నూరన్ మూచీ, మొహమ్మద్ జకారియా కురుంగడన్లను పట్టుకున్నారు.