26-09-2025 01:31:12 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : అంగన్‌వాడీ టీచర్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుండటం పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తా రు. తమ సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్ వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కశంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్ రెడ్డి రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడిక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటన్నారు.
ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సంబురం లేకుండా చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి వారి ఉసురు తగులుతుందన్నారు. అంగన్ వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ వారు వర్కర్లు కాదని, అంగన్ వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించి వారి గౌరవాన్ని పెంచారని గుర్తు చేశారు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18వేలకు పెంచు తామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని, మాయ మాటలు చెప్పి 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు చేసిన అంగన్ వాడీలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పక్షాన హరీశ్ డిమాండ్ చేశారు.
‘బతుకమ్మ’పై ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రపంచంలోనే పూలను కొలిచే పూజించే గొప్ప పండగ అయిన బతుకమ్మను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ప్రాముఖ్యతను, విశిష్టతను తగ్గిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. బతుకమ్మ ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు నాడు కేసీఆర్ హయాంలో వెలుగొందిన పండుగ నేడు ఏర్పాట్లు చేయక పండగను వెక్కిరించేలాచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో, పట్టణంలో పండగ ఏర్పాట్ల సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారని తెలిపారు.