calender_icon.png 26 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం

26-09-2025 01:28:54 AM

-అడ్డుకుని లాఠీఛార్జి చేసిన పోలీసులు 

-తీవ్రంగా గాయపడిన నాయకులు

 హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ పిలుపునిచ్చిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ర్టవ్యాప్తం గా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వైపు దూసుకెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జి చేసి, తోపులాటలకు దిగారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి స్పృహ తప్పి పడిపోగా, ఆమె ను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించారు.

పోలీసులు వందలాది మంది ని అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరి స్తుండటంతో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసు లు విశ్వప్రయత్నాలు చేశారు. అన్ని జిల్లాల్లో ముందస్తు గానే వేలాది మంది అంగన్‌వాడీలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయి నా, పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని వేలాది మంది అంగన్ వాడీలు హైదరాబాద్‌కు చేరుకుని సచివాలయం ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు.

నేతల అరెస్టులు.. సమ్మెకు పిలుపు..

దోమలగూడలోని ఏవీ కాలేజీ వద్దకు చేరుకున్న అంగన్‌వాడీలు, అక్కడి నుంచి ఇందిరా పార్క్ మీదుగా ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, అంగన్‌వాడీల రాష్ర్ట అధ్యక్షురాలు కె. సునీత, ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి, కోశాధికారి పి.మంగ సహా పలువురు నాయకులు ప్రసంగించారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకపోవడంతో వందలాది మంది అంగన్ వాడీలు సచివాలయం వైపు దూసుకెళ్లారు. ట్యాంక్‌బండ్ వద్ద పోలీసులు వారిని పెద్దఎత్తున అడ్డుకొని అరెస్ట్ చేశారు.

చిక్కడపల్లి, అంబర్‌పేట, ఖైరతాబాద్, అబిడ్స్, దోమలగూడ, ఉస్మాన్‌గంజ్ సహా పలు పోలీస్ స్టేషన్లలో అంగన్‌వాడీలను నిర్బంధించారు. ప్రభుత్వం నిర్బంధకాండను ఖండిస్తూ, అంగన్‌వాడీలందరినీ తక్షణమే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పి. జయలక్ష్మి మాట్లాడుతూ.. అక్టోబర్ 8 నుంచి సమ్మెకు దిగుతామని, ఆన్‌లైన్ కార్యక్రమాలను కూడా బంద్ చేస్తామని హెచ్చరించారు. ఈలోగా ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ పోరాటానికి సీఐటీయూ పూర్తి అండగా ఉంటుందని పాలడుగు భాస్కర్ తెలిపారు.