calender_icon.png 26 September, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారులకు అత్యంత ప్రాధాన్యం

26-09-2025 01:00:34 AM

  1.   2014 తర్వాతే ఎన్‌హెచ్ నిర్మాణాలు వేగవంతం
  2. ఈ పదేండ్లలోనే తెలంగాణలో 5 వేల కి.మీ. రోడ్లు వేశాం
  3. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2015 వరకు రాష్ట్రంలో వేసింది 2500 కి.మీ. మాత్రమే
  4. కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి వెల్లడి 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీ య రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, తెలంగాణలో 2014 తర్వాతే అత్యంత వేగవంతంగా ఎన్‌హెచ్‌ల నిర్మాణం కొనసాగుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి 2015 వరకు రాష్ట్రంలో వేసిన జాతీయ రహదారులు 2,500 కి.మీ.నని ఈ పదేండ్లలో రాష్ట్రంలో 5 వేల కి.మీ. రోడ్లు వేశామని వివరించారు. 

జాతీయ రహదారుల నిర్మాణం, డివైడర్లు, అండర్ పాస్‌లు, బైపాస్‌లు, ఫుట్ ఓవర్ల నిర్మాణం కారణంగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. అంతకు ముందు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దేఈ ఏడాది కొత్తగా 767 కిలోమీటర్ల మేర రూ.29,555 కోట్లు విలువైన రహదారుల ప్రాజెక్టులను తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనుందని మంత్రి చెప్పారు.

దీనికి అదనంగా సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీఐఆర్‌ఎఫ్) ఫండ్ కూడా తెలంగాణకు మంజూరయ్యాయని, రాష్ర్టంలో 422 కిలోమీటర్ల సీఐఆర్‌ఎఫ్ రోడ్డుకు రూ.868 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయని, మొత్తం 1,174 కిలోమీటర్లకు గానూ రూ.30,425 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టుల పని తెలంగాణలో ప్రారంభం కానుందన్నారు. హైదరాబాద్ రోడ్డులో భక్తులు, పర్యాటకుల సౌకర్యం కోసం.. 4 లేన్ ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే చేపట్టాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు.

హైదరాబాద్, కల్వకుర్తి మధ్యలో ఫోర్‌లేన్ కావాలని అడిగితే దానిపైనా నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చెప్పారన్నారు. మెట్రో విస్తరణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి సమంజసంగా లేదని, ఒక ప్రజాప్రతినిధిగా, తెలంగాణకు ప్రాజెక్టులు రావాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ముందువరసలో ఉంటానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

కాళేశ్వరంపై సీబీఐ ప్రతిపాదనలు అందాయని, అది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెరగాలని అసెంబ్లీలో మద్దతిచ్చామని కిషన్‌రెడ్డి చెప్పారు. బీసీ రిజర్వేషన్లు  కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

తెలంగాణలో చేపట్టనున్న పలు ప్రాజెక్టులు

* ఎన్‌హెచ్-353సీపై సిరోంచ (మహారాష్ర్ట) నుంచి మహాదేవ్‌పూర్ సెక్షన్ వరకు ఉన్న 17 కి.మీ. రోడ్డు విస్తరణకు రూ.163.41 కోట్లతో చేపట్టనున్నాం.

* ఎన్‌హెచ్ -930పీ పై గౌరెల్లి నుంచి వలిగొండ వరకు దాదాపు 42 కి.మీ. మేర దాదాపు రూ.690 కోట్లతో పనులు.

* ఎన్‌హెచ్ -565 నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ మధ్యలో 14 కి.మీ. 4 లేన్ బైపాస్ కోసం రూ. 516 కోట్లు.

* ఎన్‌హెచ్ 167 కే పై కృష్ణా నది వద్ద ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో సోమశిల వద్ద 1.1 కిలోమీటర్ల మేర ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1082.56 కోట్లు.

* ఎన్‌హెచ్ 167 కే పై 13.4 కి.మీ. ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్‌కు అప్రోచ్ రోడ్ల విస్తరణ కోసం రూ.436.92 కోట్లు

* ఎన్‌హెచ్ -930పీ పై వరంగల్ జిల్లా తొర్రూరు నుంచి నెహ్రూనగర్ వరకు దాదాపు 69.1 కి.మీ. మేర రోడ్డు విస్తరణ పనులకు రూ.674.92 కోట్లు

* ఎన్‌హెచ్ -930 పీ పై నెహ్రూనగర్ నుంచి కొత్తగూడెం వరకు దాదాపు 52.1 కి.మీ. మేర రోడ్డు విస్తరణ పనులకు రూ.826.71 కోట్లతో ప్రాజెక్టు మంజూరు.

* ఎన్‌హెచ్ -353 సీపై సిరోంచ (మహారాష్ర్ట) నుంచి ఆత్మకూరు వరకు దాదాపు 41.3 కి.మీ. మేర రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించే పనులకు రూ.662.67 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు తుది దశకు చేరుకున్నాయి.

* ఎన్‌హెచ్ 63పై మహారాష్ర్ట సరిహద్దుల నుంచి బోధన్ వరకు దాదాపు 4.5 కిలోమీటర్ల మేర రోడ్డుకు మరమ్మతులు చేప ట్టేందుకు రూ.4.97 కోట్ల విలువైన పనులు

* ఎన్‌హెచ్ 365పై నకిరేకల్ నుంచి తానంచర్ల (ఆంధ్రప్రదేశ్) వరకు దాదాపు 28.67 కి.మీ. మేర రోడ్డుకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.18.72 కోట్లు

* ఎన్‌హెచ్ -930పీ పై మహబూబాబాద్ నుంచి నెల్లికుదురు, తొర్రూరు నుంచి నెల్లికుదురు వరకు, తొర్రూరు నుంచి వలిగొం డ, మహబూబాబాద్ నుంచి ఎల్లందు, గౌ రెల్లి నుంచి కొత్తగూడెం రోడ్డు వరకు దా దాపు 21.5 కిలోమీటర్ల మేర రోడ్డుకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.29.61 కోట్లు.

* ఎన్‌హెచ్ -61పై నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు దాదాపు 3.24 కిలోమీటర్ల మేర రోడ్డుకు మరమ్మతులు చేపట్టేందుకు రూ. 14.53 కోట్ల విలువైన ప్రాజెక్టు మంజూరు. 

* ఎన్‌హెచ్ -161 బీబీపై బోధన్- భైంసా సెక్షన్‌లో దాదాపు 11.2 కి.మీ. మేర రోడ్డుకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.16.45 కోట్ల విలువైన ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానం.

* ఎన్‌హెచ్ 565పై నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు రూ.4.9 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మాణం

* ఎన్‌హెచ్ -63పై జగిత్యాల నుంచి మంచిర్యాల వరకు 63.60 కి.మీ. మేర రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించే పనులను రూ.2,338 కోట్లు

* ఎన్‌హెచ్ 63పై జగిత్యాల నుంచి మంచిర్యాల వరకు 66.295 కి.మీ. మేర రోడ్డును 4 లేన్లకు విస్తరించే పనులను రూ.2,548 కోట్లు.

* ఎన్‌హెచ్--563పై జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు 58.60 కిలోమీటర్ల మేర రోడ్డును 4 లేన్లకు విస్తరించే పనులను రూ.2,484 కోట్లు

* హైదరాబాద్- -పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఎన్‌హెచ్--167పై గూడె బెల్లూరు (పాలమూరు యూనివర్సిటీ దగ్గర) నుంచి మరికల్ వరకు 80.01 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించే పనులను రూ.2662 కోట్లతో చేపట్టనున్న పనులు ఈ సంవత్సరం ప్రారంభం కానున్నాయి. 

* హైదరాబాద్- -పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా హసన్‌పూర్ (కర్ణాటక), కడూరు (పాలమూరు) వరకు 10.36 కి.మీ. మేర బైపాస్ రోడ్డు నిర్మించేందుకు రూ.344 కోట్లు.

* హైదరాబాద్ ఉత్తరాన గిర్మాపూర్ (మేడ్చల్ జిల్లా) నుంచి తంగడపల్లి వరకు 4 లేన్లతో 161.518 కిలోమీటర్లతో గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్‌ప్రెస్ వేను రూ.13,957 కోట్ల తో చేపట్టనున్న ప్రాజెక్టుకు 2025, సెప్టెంబర్ 3వ తేదీన బిడ్లను ఆహ్వానించారు.

* ఎన్‌హెచ్--44పై ఆరు లేన్లతో కామారెడ్డి జిల్లా సీఎంసీ జంక్షన్ వద్ద అండర్‌పాస్, సదాశివనగర్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి (మొత్తం 3.18 కిలోమీటర్లు) రూ. 53.80 కోట్ల విలువైన ప్రాజెక్టుకు సంబంధించి బిడ్లను అధికారులు విశ్లేషిస్తున్నారు.

* ఎన్‌హెచ్-163పై హైదరాబాద్--యాదగిరిగుట్ట సెక్షన్‌లో 6 లేన్లతో ఒక కిలోమీటరు మేర అండర్ పాస్‌ను రూ.26.76 కోట్లతో నిర్మించనున్నాం.