calender_icon.png 29 October, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీరాన్ని తాకిన మొంథా తుఫాన్

29-10-2025 12:43:36 AM

-తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు

-స్తంభించిన జన జీవనం

-గంటకు 90 కి.మీ వేగంతో ఈదురు గాలులు

- 75 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

అమరావతి/హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): బంగళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది పాలెం సమీ పంలో తీరం తాకింది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తున్నది. గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలకు కృష్ణా, ఏలూరు, ఉభయ గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జన జీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాలు, 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుఫాన్ ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే 2,194 పునరావాస కే్రందాలను ఏర్పాటు చేశామని చెప్పింది.

19 జిల్లాల పరిధుల్లోని 54 రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని పేర్కొంది. విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం పోర్టులకు హెచ్చరికల స్థాయినిపెంచింది. కాకినాడ పోర్టుకు 10వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు తొమ్మిది, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఎనిమిదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే 120 మంది రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారిమళ్లించింది. పలు విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. దీనిలో భాగంగానే విశాఖపట్నంలో 32, విజయవాడలో 16, తిరుపతిలో 4 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

కోనసీమ జిల్లా మాకనగూడెంలో బలమైన గాలుల వీచి చెట్టు కూలి ఒక మహిళ మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 60 ట్రాలర్లు ఛత్రపురం సమీపంలో అర్జిపల్లి వద్ద సముద్రంలో చిక్కుకున్నాయి. తక్షణమే స్పందించిన జిల్లా యంత్రాంగం మొత్తం 60 ట్రాలర్లను గోపాల్‌పుర్ ఓడరేవులో లంగర్లు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆయా ట్రాలర్లలోని 600 మందిని సురక్షితంగా కాపాడి, వారికి ఆహారం, తాగునీరు, ఔషధాలు అందజేసినట్లు మత్స్యశాఖ ఉపసంచాలకుడు సంగ్రామ్ కర్ విలేకరులకు తెలిపారు. 

యంత్రాంగం అప్రమత్తం

రాష్ట్రవ్యాప్తంగా 403 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉండనుందని, అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1204 సెంటర్లను ఏర్పాటు చేసి, 75,802 మందిని కేంద్రాలకు తరలించారు. 219కి పైగా మెడికల్ క్యాంపులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్‌లెస్ టవర్లను సైతం ఏర్పాటు చేశామని, తుఫాన్‌ను ఎదుర్కొనేందకు ఇతర యంత్రసామగ్రిని సిద్ధంగా ఉంచామని అధికారులు పేర్కొన్నారు. తుపాన్ నేపథ్యంలో ఏపీలోని కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. మంగళ, బుధవారాల్లో నడిచే 107 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మంగళవారం 70, బుధవారం 36, గురువారం ఒక రైలును రద్దు చేశామని పేర్కొంది. ఆరు రైళ్లను దారిమళ్లించామని, 18 రైళ్ల సమయాల్లో మార్పులు చేశామని పేర్కొంది.

ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

తుఫాన్ అప్రమత్తతపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అమరావతి లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగాన్ని హెచ్చ రించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చూచించారు. తీరం దాటే కాకినాడ, పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీర్‌ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రాత్రి 8:30 నుంచి బుధవారం ఉదయం 6 గం టల వరకు వాహనాల రాకపోకలపై పూర్తి నిషేధం (నైట్ కర్ఫ్యూ) విధించారు. అత్యవసర వైద్య సేలు, రవాణాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.