25-05-2025 12:00:00 AM
వేడుక ఏదైనా.. భోజన ప్రియులు మొదటగా అడిగేది దాల్చా ఉందా అని? దాల్చాలో చాలా రకాలు ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ ఇలా రకరకాల దాల్చాలు ఉంటాయి. వాటి రుచి కూడా అద్భుతం. అయితే చాలామంది ఇంట్లో ఈ రెపిసీ ట్రై చేసినప్పటికీ అంత పర్ఫెక్ట్‌గా రాదు. కింద చెప్పిన విధంగా ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే దాల్చా రుచి అచ్చం పెళ్లిలో తిన్నట్టుగానే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. కుకింగ్‌నే ఫ్యాషన్‌గా అతివల రుచులు మీ కోసం..
గరం గరం మటన్ దాల్చా..
కావాల్సిన పదార్థాలు: మటన్ అర కిలో, కందిపప్పు అర కప్పు, శనగపప్పు, చింతపండు పులుసు పావు కప్పు చొప్పున, నూనె నాలుగు చెంచాలు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు అర చెంచా, బిర్యానీ ఆకు ఒకటి, దాల్చిన చెక్క చిన్న ముక్క, టొమాటోలు, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి రెండు చొప్పున, చిన్న ఉల్లిపాయలు ఐదు, పచ్చిమిర్చి నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, గరంమసాలా చెంచా, ఉల్లితరుగు సగం కప్పు, మిరియాలు, జీలకర్ర అర చెంచా, ఆవాలు పావు చెంచా, కరివేపాకు రెండు రెబ్బలు, వంకాయ ఒకటి, మామిడికాయ సగం చెక్క, కొత్తిమీర గుప్పెడు, నెయ్యి ఒక చెంచా.
తయారీ విధానం: శనగ, కందిపప్పులను నానబెట్టాలి. కుక్కర్‌లో నూనె వేడయ్యాక.. యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలను అర నిమిషం వేయించాలి. అందులో చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేయాలి. అవి వేగాక.. మటన్ ముక్కలు జతచేసి కలుపుతుండాలి. తర్వాత శనగ, కందిపప్పులు, తగినన్ని నీళ్లు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి.
కుక్కర్ మూతపెట్టాలి. మీడియం ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. ఆవిరి తగ్గాక కుక్కర్ మూత తీసి.. కూరగాయ ముక్కలు, చింతపండు పులుసు జతచేసి మూత పెట్టి ఉడికించాలి. కడాయిలో నూనె, నెయ్యి వేడయ్యాక.. ఆవాలు జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మిరియాలు, ఉల్లితరుగులను వేయించాలి. దోరగా వేగాక.. మాంసం మిశ్రమంలో కలిపి పైన కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకుంటే.. మటన్ దాల్చా రెడీ!
షీనా, యూట్యూబర్
నోరూరించే చికెన్ దాల్చా..
కావాల్సిన పదార్థాలు: చికెన్ అర కేజీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచా, పెరుగు రెండు చెంచాలు, ఆలుగడ్డలు మూడు, ఉల్లిపాయలు మూడు, పసుపు సగం చెంచా, కారం మూడు చెంచాలు, ఆవాల నూనె నాలుగు చెంచాలు, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా చెంచా, జీలకర్ర పొడి అర చెంచా, చక్కెర అర చెంచా, బిర్యానీ ఆకులు రెండు, లవంగాలు నాలుగు, యాలకులు నాలుగు, దాల్చిన చెక్క ఒకటి, నీరు సరిపడా.
తయారీ విధానం: ముందుగా ఆలుగడ్డలపైన చెక్కు తీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత వీటిని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను సన్నగా కట్ చేయాలి. ఇందులో కొన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో చికెన్, పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆవాల నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత స్టౌపై పాన్ పెట్టి.. అందులో ఆవాల నూనె వేసి.. కొద్దిగా వేడి కాగానే ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి వేసి మిక్స్ చేయాలి.
కొన్ని నీళ్లు పోసి మసాలా మిశ్రమం చిక్కగా మారిన తర్వాత.. మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలపాలి. అదే మిశ్రమంలో పెరుగు, ఆలుగడ్డ ముక్కలు వేసి కలపాలి. తర్వాత గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్న తర్వాత.. గరం మసాలా వేసి మిక్స్ చేయాలి. రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
ఆర్తి సతీష్ ఫుడ్ బ్లాగర్
మిక్స్‌డ్ వెజిటబుల్..
కావాల్సిన పదార్థాలు: కందిపప్పు సగం కప్పు, శనగ పప్పు సగం కప్పు, క్యారెట్లు రెండు, ఆలుగడ్డలు రెండు, మునక్కాడలు రెండు, బీన్స్ నాలుగు, బఠాణీలు పావు కప్పు, ఉల్లిగడ్డ ఒకటి, పచ్చిమిర్చి నాలుగు, అల్లం తురుము చెంచా, వెల్లుల్లి రెబ్బలు మూడు, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు నాలుగు, మిరియాలు ఒక చెంచా, యాలకులు మూడు, కొబ్బరి పాలు మూడున్నర కప్పులు, కరివేపాకు రెండు రెబ్బలు, ఉప్పు తగినంత, నూనె రెండు చెంచాలు.
తయారీ విధానం: ముందుగా పప్పును మొత్తగా ఉడికించుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కూరగాయలన్నీ ముక్కలుగా కోయాలి. తర్వాత స్టౌపై గిన్నె పెట్టి నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి. తర్వాత అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
తర్వాత కూరగాయముక్కలన్నీ వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసి ముక్కలు మెత్తగా అయ్యే వరకూ సిమ్‌లో ఉడికించి దించాలి. చివరగా ముందుగా ఉడికించుకున్న పప్పును దీంట్లో వేసి కలుపుకుంటే మిక్స్‌డ్ వెజిటబుల్ దాల్చా రెడీ అయినట్టే.
స్వప్న వైట్ల, యూట్యూబర్
మసూర్ దాల్చా..
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ఎర్రపప్పు, పచ్చి బఠానీలు సగం కప్పు, బెండకాయ ఒకటి, వంకాయ ఒకటి, ఆలుగడ్డలు రెండు, నల్ల మిరియాలు ఆరు, దాల్చిన చెక్క చిన్న ముక్క, తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, పచ్చిమిరపకాయలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు సగం చెంచా, ఉప్పు తగినంత, పసుపు సగం చెంచా, కారం కొద్దిగా, కొబ్బరి పాలు సగం కప్పు, నూనె రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు సగం కప్పు.
తయారీ విధానం: స్టౌపై ఒక గిన్నె పెట్టి దాంట్లో కొద్దిగా నూనె పోసి వేడయ్యాక.. లవంగాలు, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. త ర్వాత ఉల్లిపాయ, ప చ్చిమిర్చి, ఉప్పు, కూరగాయలు, అల్లం పేస్టు వేసి పది నిమిషాలు సిమ్‌లో ఉడి కించుకోవాలి.
తర్వాత కొబ్బరి పాలు వేసి అర నిమి షం ఉడికించాలి. తర్వాత పప్పులు, పచ్చి బఠానీలు, నీరు పోసి బాగా కలపాలి. ఇప్పుడు దాల్చా బాగా చిక్కబడిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే మసూర్ దళ్ తడ్కా రెడీ.
రిచా హింగిల్, రెసిపీ డెవలపర్