01-06-2025 12:00:00 AM
ప్రేమ ఎన్ని మధురానుభూతుల్ని పంచుతుందో.. బ్రేకప్ అంతకుమించిన చేదు జ్ఞాపకాల్ని మిగుల్చుతుంది. వాటిని అంత సులుభంగా మర్చిపోవడం ఎవరికీ సాధ్యం కాదు. కొంతమంది పైకి బ్రేకప్ చెప్పినా.. ప్రేయసి లేదా ప్రియురాలిని మర్చిపోలేకపోతుంటారు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా వాళ్ల గురించి తలచుకోవడం, వాళ్లతో ఉన్న జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటారు.
బాగా కావాల్సిన వారితో గొడవపడినప్పుడు.. ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందిలో ఉంటుంది. అలాగే బ్రేకప్ తర్వాత తమ మాజీ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. దీనికోసం కొంతమంది మారు పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు తెరిచి వాళ్లు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? వాట్సప్‌లో స్టేటస్ ఏం పెట్టారు? డీపీ ఫొటోలు మారుస్తున్నారా?
ఇలాంటి విషయాలన్నీ పదే పదే చెక్ చేస్తుంటారు. దీనివల్ల మీ సమయం మరింత వృథా అవడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు. పైగా ఇలా చేయడం వల్ల మరింత మానసిక క్షోభకు గురికావాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మాని.. వారితో పాటు వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లు, ఫోన్ నంబర్లకు కూడా బ్రేకప్ చెప్పడం వల్ల ఆ జ్ఞాపకాలు గుర్తు రాకుండా జాగ్రత్తపడవచ్చు అంటున్నారు నిపుణులు.