25-05-2025 12:00:00 AM
అమృతా సింగ్.. చక్కటి అభినయం, అందంతో ప్రేక్షకుల మదిలో ముద్రవేశారు. 1980లో వెండితెరపై ‘బేతాబ్’ అనే సినిమాతో ఆరంగ్రేటం చేశారు. ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. అమృతకు మూడు భాషలు అలవోకగా వచ్చు.. ఒకటి పంజాబీ, హిందీ, ఇంగ్లిష్ భాషల పట్ల మంచి పట్టు ఉండటంతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నది.
మార్డ్, నామ్, చమేలి కి షాదీ, రాజు బన్ గయా జెంటిల్‌మన్ వంటి చిత్రాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. ప్రఖ్యాత నవలా రచయిత దివంగత కుష్వంత్ సింగ్ మేనకోడలు ఈమె. అలాగే అమృతకు సినీ రంగంలో అనేకమందితో మంచి సంబంధం ఉన్నది. బాలీవుడ్‌లోకి రాకముందు బెల్లీ డ్యాన్సర్‌గా వర్క్ చేసింది.
టూ స్టేట్స్ మూవీతో..
ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ, నటి షర్మిలా ఠాగూర్ కుమారుడు సైఫ్ అలీఖాన్‌ను 1991లో ప్రేమ వివాహం చేసున్నది. సైఫ్‌కి, ఆమెకి మధ్య చాలా వయసు తేడా ఉంది. కానీ, వీరి ప్రేమకు వయో పరిమితి అడ్డు రాలేదు. పెళ్లి తర్వాత కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడపాలని నటనను వదిలేసింది. సైఫ్ అలీ ఖాన్, అమృతకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు సారా అలీఖాన్, అబ్బాయి పేరు ఇబ్రహీం అలీ ఖాన్.
సైఫ్, అమృతల వైవాహిక జీవితం చాలా బాగా సాగింది. కానీ, ఇటాలియన్ మోడల్ రోసా సైఫ్ జీవితంలోకి రావడం వారి విడాకులకు కారణమైంది. సైఫ్ ముంబైలో రోసాతో కలిసి జీవించడం ప్రారంభించడంతో అమృత, సైఫ్ మధ్య దూరం పెరగడం మొదలైంది. ఆ తర్వాత ఇదంతా తట్టుకోలేక 2004లో సైఫ్ నుంచి విడాకులు తీసుకుంది. అయితే, రోసా సైఫ్ రిలేషన్ షిప్‌కు కూడా త్వరలోనే తెరపడింది.
తర్వాత కరీనా సైఫ్ జీవితంలోకి ప్రవేశించింది. విడాకుల తర్వాత దాదాపుగా ఒక దశాబ్దం పాటు నటనకు విరామం తీసుకొని 2002లో కలియుగ్, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా వంటి చిత్రాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఐనా చిత్రంతో ఆమె నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. తర్వాత ‘టూ స్టేట్స్’ మూవీలో ఆమె పాత్రకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది.
అదొక చెత్త విషయం
అమృతా సింగ్ విడాకుల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ అన్నారు. జవానీ జనేమాన్ చిత్రంలో నటిస్తున్న సైఫ్ పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో నటించనున్న సైఫ్.. తన ముగ్గురు పిల్లల గురించి కూడా మాట్లాడారు. అలాగే అమృతతో విడాకులపై కూడా స్పందించారు.
అమృతతో విడాకులు తీసుకున్న విషయాన్ని సారా, ఇబ్రహీంలకు ఎలా చెప్పారని ప్రశ్నించగా సైఫ్ స్పందిస్తూ.. ‘ఇది ప్రపంచంలోనే చెత్త విషయం. దీన్ని భిన్నమైన విషయంగా భావిస్తున్నాను. ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని ఎప్పటికీ అనుకోను. కొన్ని సంఘటనల నుంచి ఎప్పటికీ బయటపడలేమన్నా విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుందని’ భావోద్వేగానికి లోనయ్యారు.
ఖరీదైన విల్లా..
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అమృత ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఈ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్లు తెలిసింది. ఈ విలాసవంతమైన అపార్టెంట్ విలువ దాదాపు రూ.18 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. 67 ఏళ్ల అమృతా సింగ్ ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు. రాహుల్ రావ్లి సినిమా సెట్‌లో సైఫ్ అలీ ఖాన్, అమృత ఒకరినొకరు కలిశారు.