05-11-2025 08:37:44 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణం, మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శివాలయాలకు, సమీప దేవాలయాలకు పోటెత్తారు. వేకువ జామునే మహిళలు, భక్తులు ఉసిరి, తులసి చెట్ల వద్ద దీపాలు వెలిగించి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తులసీ వ్రతాలను నోముకున్నారు. సమీప గోదావరి నది తీరంలో పవిత్ర కార్తీక మాస నది స్నానం ఆచరించి నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి.
పట్టణం మండలంలోని పలు ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించడంతో ఆలయ ప్రాంగణాలని దీప కాంతుల శోభతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. కార్తీక మాసాన్ని, మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా శివాలయాలు, పలు ఆలయాలు భక్త జన సందోహంతో కిటకిటలాడాయి. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలను వెలిగించి, 365 వత్తులతో కూడిన దీపాలను సమర్పించారు. కార్తీక పౌర్ణమి భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ప్రధాన ఆలయ కమిటీలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు వెలిగించిన దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణమంతా నూతన శోభను సంతరించుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.