22-10-2025 12:00:00 AM
దేశ రాజధాని న్యూఢిల్లీని వాయు కాలుష్యం నరకంగా మార్చేసింది. మితిమీరిన కాలుష్యంతో స్థానిక జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో నిర్మాణ పనులపై ఆంక్షలు విధించడంతో పాటు లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. అయితే ఈ వాయు కాలుష్యం కేవలం ఢిల్లీకే మాత్రమే పరిమితం కాలేదు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గ్రేటర్ నోయిడా తదితర ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత అంత కంతకూ దిగజారుతుండడం ఆందోళన కలిగించే అంశం.
ఇక ఢిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 50 రెట్లు ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ -ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హె చ్చరించారు. సోమవారం దీపావళి పర్వదినం పురస్కరించుకొని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో టపాసులు కాల్చడంతో వాయు నాణ్యత మరింత క్షీణించింది. కాలుష్యం కారణంగా ఢిల్లీలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. కానీ సుప్రీం ఆంక్షలు లెక్కచేయని అక్కడి ప్రజలు విచ్చలవిడిగా టపాసులు కాల్చారు.
దీంతో దీపావళి తర్వాత 24 గంటల్లో సగటు పీఎం 2.5 సాం ద్రత ఒక క్యూబిక్ మీటర్‌కు 488 మైక్రోగ్రాములకు చేరింది. పండగకు ముందు ఇది 156.6 మైక్రోగ్రాములుగా ఉండడం గమనార్హం. జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 506, సోనియా విహార్‌లో 462 కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత దశాబ్ద కాలంగా ఢిల్లీలో ఇదే పరిస్థితి ఏర్పడుతూ వస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ పొరుగున ఉన్న యూపీ, హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులపెట్టడం, పరిశ్రమల నుంచి వెలువడుతున్న విష వాయువుల వల్ల దేశ రాజధానికి ఈ దుస్థితి ఏర్పడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక ప్రకారం.. 2021 నుంచి ఏటా దీపావళి ముందు, ఆ తర్వాత సగ టు పీఎం 2.5 స్థాయి పెరుగుతూనే వస్తుంది.
రుతుపవనాల తిరోగమనం అనంతరం ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే, మానవ తప్పిదాలు వాయు కాలుష్యం స్థాయిని మరింత పెంచు తున్నాయి. ప్రజలకు కాలుష్యం దుష్ర్పభావాలు తెలియక తీవ్ర సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక సాంకేతిక విధానాలు కూడా ప్రకృతి విధ్వంసానికి కారణాలవుతున్నాయి. గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సుడ్, ఆర్గాన్, నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి, వ్యవసాయానికి, మానవులకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. తోడ్పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 మిలియన్ల మంది ప్రాణాలను హరించేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
వ్యాసకర్త: ముచ్చుకోట సురేశ్