calender_icon.png 22 July, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అగ్నిధార’ల అక్షరనిధి దాశరథి

22-07-2025 12:05:19 AM

రతన్ రుద్ర :

నేడు మహాకవి దాశరథి జయంతి

ఓ పరాధీన మానవా! ఓపరాని 

దాస్యము విదల్చలేని శాంతమ్ము మావి 

తలపులను ముష్టి బంధాన కలచి వైచి 

చొచ్చుకొనిపొమ్ము, స్వాతంత్య్రపురమ్ము! 

రజాకార్లు సభాప్రాంగణ పందిళ్లు, వేదికను తగులబెడుతుంటే వేదికపై నిర్భీతిగా ఈ- పద్యం చదివాడు దాశరథి కృష్ణమాచార్యులు. సభా వేదికలపై ఆయన పాడిన మొదటి పద్యమిదే. 1944లో వరంగల్‌లో జరిగిన ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ప్రథమ వార్షిక వేడుకలో కనిపించిందీ దృశ్యం. రజాకార్లు రాళ్లు రువ్వుతున్నా, తుపాకులు ఎక్కుపెట్టినా దాశరథి స్వరం ఎల్ల ప్పుడూ ధిక్కారమే.

రజాకార్ల అరాచకాలను తన అక్షరాయుధంతో ఎదిరించిన కవి ‘మా నిజాం రాజు.. తరత రాల బూజు’ అని నినదించిన ధీశాలి. ఊరూరా పద్యం పాడుతూ, జనాల్లో చైతన్యజ్వాల రగిలిస్తున్నాడని జైలు లో పెడితే, జైలు గోడలపై నిజాంను ధిక్కరిస్తూ కవితలు రాసిన సాహసవంతుడు. నిజాం నిరంకుశుత్వంపై ‘అగ్నిధారలు’ కురిపించినవాడు. ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అని ఉప్పొంగిన వాడు. 

ఛాందస భావాలపై తిరుగుబాటు

దాశరథి తండ్రి కరుడుగట్టిన సంప్రదాయవాది. ప్ర పంచంలో ఉన్న భాషలన్నింటిలో సంస్కృతమే గొప్పదని నమ్మినవాడు. అది ఎంతటి ఛాందసమంటే ఇం ట్లో కూడా సంస్కృతమే మాట్లాడే వాడు. ఉదాహరణ కు ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?’ అనే బదులు ‘త్వంపత్ర గచ్ఛపి’ అని సంస్కృతంలో ప్రశ్నిస్తాడు. ఆ -ఛాందస భావాలు నచ్చక ఎదురు తిరిగి దాశరథి ఎన్నోసార్లు తండ్రితో దె బ్బలు తిన్నాడు.

బడిలోనూ దాశరథిది ఇదే ధోరణి. తాను చదివిన బడి అచ్చమైన మదర్సా. ఉదయం ఉ ర్దూ ప్రార్థనా గీతంతో తరగతులు మొదలయ్యేవి. వి ద్యార్థులంతా ‘తాబద్ ఖాలిఖె ఆలం, యెరియాసత్క్క్రే’ అని ఆలపించేవారు. ఏ విద్యార్థయినా గొంతు తప్పితే హెడ్‌మాస్టర్‌తో తన్నులు తప్పేవి కావు. ఉర్దూ పలకటం రాక దాశరథి ఎన్నో సార్లు బెత్తం దెబ్బలు తిన్నాడు. 

హైదరాబాద్ అంటే మక్కువ.. మొగ్దుం అంటే ప్రాణం 

దాశరథికి హైదరాబాద్ అంటే ఎంతో మక్కువ. ఉర్దూకవుల ‘ముషాయిరా’ సమ్మేళనాలు, కవితాగానాలు ఆయన్నెంతో ఆకర్షించేవి. విశ్వ విఖ్యాత ఉర్దూ కవి మొగ్దుం మోయినోద్దీన్ దాశరథికి ప్రాణ మిత్రుడు. మొగ్దుం సాహిత్య సభల్లో ఉర్దూ పద్యం చదువుతుంటే పరవశించిపోయే వాడు. ‘యహ్ జంగ్‌హై జంగే ఆజా దీ ఆజాదీకే పర్చంకకేతరే’ అని 1992లో మొగ్దుం రాసి న పద్యమంటే దాశరథికి ఎంతో ఇష్టం.

ఆ పద్యంపై ఇష్టాన్ని ‘స్వాతంత్య్ర పతాక నీడల్లో... ఇది సమరం, స్వేచ్ఛా సమరం’ అంటూ తెలుగులో అనువదించి లోకానికి చాటి చెప్పాడు. నగరంలో జరిగే కవిసమ్మేళనాలకు హాజరుకావడం ఆయనకెంతో ఇష్టంగా ఉండే ది. పాతబస్తీ అగరొత్తుల పరిమళం, అత్తరు సుగంధా లు, కవులు బిగించే పాన్ బిరడాలు, వారు ధరించే కమీజులు, షేర్వాణీలు, నల్లటోపీలు, వారు ఆస్వాదించే అసలు సిసలు ఇరానీ ఛాయ్ దాశరథిని ఎంతో ఆకర్షించాయి.

హైదరాబాద్‌నగరంలో రిక్షావాలాలు, వీధి వ్యా పారులు సైతం ఆసువుగా ఉర్దూలో పద్యాలు అల్లడాన్ని చూసి దాశరథి నివ్వెరపోయేవాడు. వారి ప్రతిభను ఎన్నోసార్లు ముషాయిరా వేదికలపై ప్రశంసించాడు. వారిలో కొందరికి కవితా వేదికలపై ముషాయిరాలు వినిపించే అవకాశం కల్పించాడు.

అలాగే హైదరాబాద్ వస్తే తప్పకుండా గోల్కొండ పత్రికా కార్యాలయానికి వెళ్లేవాడు. పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాప రెడ్డిని కలుసుకోవడం, కాసేపు ముచ్చటించడం పరిపా టి. ‘ఆంధ్రా కుటీరం’లో మాడపాటి హనుమతరావును దర్శించుకోవడమూ ఆయనకు ఇష్టంగా ఉండేది. 

‘గజల్’ ప్రియుడు

దాశరథి ఉర్దూ గజల్ ప్రియుడు. గజల్ గీతాలు ఆయన్నెంతో ఆకర్షించేవి. ఉర్దూ గజల్ ప్రక్రియలో సిద్ధహస్తుడైన గాలీబ్ గీతాలను తెలుగు వారికి పరిచయం చేయాలనే ఆకాంక్ష ఆయనకు బలంగా ఉండేది. ఇంకా చెప్పాలంటే తన జీవితాశయంగా ఉండేది. తాను -రాసిన ‘గాలిబ్ గీతాలు’ కవితా సంపుటిని చదివి అప్పటి ప్రసిద్ధ కవి ఆరుద్ర, నటులు జగ్గయ్య, అక్కినేని, ఉర్దూ కవి మొగ్దుం మంత్రముగ్ధులయ్యారు.

దాశరథి ఈ పుస్తకాన్ని అక్కినేనికి అంకితమిచ్చారు. గాలిబ్ పుస్తకానికి ‘జుగ్తాయ్’ బొమ్మలు వేయగా, దాశరథి అప్పటికే ప్రసిద్ధ చిత్రకారుడైన ‘బాపు’తో బొమ్మలు వేయించా డు. ‘జుగ్తాయ్’ బొమ్మలను మరిపించేలా ‘బాపు’ బొ మ్మలున్నాయని తెగమురిసిపోయాడు దాశరథి. ఆ పుస్తకంలోని గజళ్లు మచ్చుకు ఒకటి. 

‘నసితాయెష్‌కి తమన్నా, 

నసీలెక పర్వా,

నస హీ గర్ మెరె అష్ అర్

మె మానీ నసహీ’

అని గాలీబ్ ఉర్దూ గజల్ రాస్తే, దానిని దాశరథి ‘ఏ పొగడ్తల గోర నే నేరికడనులెక్క జేయను బహుమతుల్‌జికుకున్న, నాదు కవితలనర్థమే లేదయేని లేకపో నిమ్ము! అద్దాని లెక్కజేయ’ అని అనువదించాడు. -

నిజాం ప్రభుత్వంపై ధిక్కార స్వరం

నిజాం ప్రభుత్వం కవులు, ఉద్యమకారులపై నిర్బం ధం విధించడంపై దాశరథి ధిక్కార స్వరాన్ని వినిపించా రు. కవి కాళోజీ నారాయణరావు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి వంటి ఎందరో ఉద్యమకారులతో కలిసి జైలు శిక్ష అనుభవించాడు. ఖైదీలకు అందించే ఉడికీ ఉడకని జొన్న రొట్టెలు, పురుగులన్నంపై దాశరథి ఎన్నో సార్లు నిరసన వ్యక్తం చేశాడు. రాజకీయ ఖైదీలు చదువుకునేందుకు పుస్తకాలు ఇవ్వాలని, రాసుకునేందుకు తెల్ల కాగితాలు, కలాలు ఇవ్వాలని డిమాండ్ చేసి, హక్కులు సా ధించాడు కూడా. తెలంగాణ సాయిధ పోరాటానికి తన అక్షర సాయమందించాడు దాశరథి.  

ప్రాణము లొడ్డి ఘోర భయ

దాటవులన్ పడగొట్టి మంచి మా

గాణములన్ సృజించ నెముకల్

నుసిజేసి పొలాలు దున్ని బో

షాణములన్ నవాబునకు

స్వర్ణము నింపిన రైతుదే, తెలం

గాణము రైతుదే; ముసలి

నక్కకు రాచరికంబు దక్కునే? 

అంటూ ‘మహాంధ్రోదయం’లో గర్జించాడు. సాయు ధ పోరాటంలో ముందుండి పోరాడుతున్న రైతులను, యువతను ఉద్దేశిస్తూ -తెలంగాణను కీర్తిస్తూ.. 

“మూగవోయిన కోటి తమ్ముల గళాల 

పాట పలికించి కవితాజనమ్ము కూర్చి

నా కలానికి బలమిచ్చి నడపినట్టి

నా తెలంగాణా కోటి రతనాల వీణ” 

అంటూ అక్షర ప్రవాహం పొంగించాడు. 

సాహితీరంగంలో శిఖరం

అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ, అమృతాభిషేకం, ధ్వజమెత్తిన ప్రజ, తిమిరంతో సమరం, పునర్నవం, గాలిబ్ గీతాలు, మిన్నేటి పొంగులు, జ్వాలాలేఖిని, మహాబోధి, నవమంజరి దాశరథి ప్రసిద్ధ రచనలు. ‘యాత్రాస్మృతి’ ఆయన స్వీయచరిత్ర. అంతేకాదు దాశరథి సినీరంగంలోనూ అనేక చిత్రాలకు పాటలు రాశారు. ‘ఆత్మీయులు’ చిత్రంలో ‘మదిలో వీణలు మ్రోగె, ఆశలెన్నో చెలరేగె’, ‘రాము’ లో ‘రారా కృష్ణయ్యా’, ‘మూగ మనసులు’ లో ’ గోదారీ గట్టుంది.. గట్టు మీద చెట్టుంది’, ‘ఇద్దరు మిత్రులు’లో ‘ఖుషి ఖు షీగా నవ్వుతూ’ అంటూ సాగే పాటలు ఇప్పటికీ జనం నోళ్లపై కదలాడుతుంటాయి.

ఆయన సాహిత్యకృషికి ‘కేంద్ర సాహిత్య అకాడమీ’ అవార్డు వరించింది. సాహిత్యరంగంలో ఉంటూ, ఆ రంగంలో సేవలందిస్త్తున్న క్ర మంలో ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 1987 నవంబర్ 5వ తేదీ కార్తీక పున్నమి నాడు ఆయన కన్నుమూశారు. ఈ ఏడాది జూలై 22తో దాశరథి శతజయంతి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా ఆ అభ్యుదయ కవి సామ్రాట్‌కు నివాళి!!