calender_icon.png 22 July, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమాజిగూడలో బస్ షెల్టర్ల తొలగింపు

22-07-2025 01:28:36 AM

  1. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
  2. ప్రజా ఆస్తిని కాపాడాలంటూ పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్, సిటీ బ్యూరో జూలై 21 ( విజయక్రాంతి): హైదరాబాద్ నడిబొడ్డున, సోమాజిగూడలో ప్రజా ఆస్తిని కబ్జా చేసి, బస్ షెల్టర్లను అక్రమంగా తొలగించారంటూ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు నమోదైంది. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్‌ను ఆనుకుని ఉన్న ప్రధాన రహదారిపై బూరుగు ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ అక్రమాలకు పాల్పడిందని,

దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని రామ్‌స్వరూప్ అగర్వాల్ అనే వ్యక్తి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు రామ్‌స్వరూప్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. 1999లో ప్రయాణి కుల సౌకర్యార్థం బస్ బే మరియు బస్ షెల్టర్ల నిర్మాణం కోసం అప్పటి ఎంసీహెచ్ (ప్రస్తుత జీహెచ్‌ఎంసీ) అధికారులు హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి 648 చదరపు గజాల స్థలాన్ని సేకరించారు.

అయితే ప్రస్తుతం ఆ స్థలంలో నిర్మాణ పనులు చేపడుతున్న బూరుగు ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ.. ప్రజల కోసం కేటాయించిన ఆ బస్ షెల్టర్ల స్థలాన్ని, ఫుట్‌పాత్‌ను పూర్తిగా కబ్జా చేసిందని ఆయన ఆరోపించారు. ఫుట్‌పాత్ ఎత్తును కూడా విపరీతంగా పెంచేయడంతో, వృద్ధులు మరియు మహిళలు నిలబడటానికి కూడా వీలు లేకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ అక్రమ కబ్జా వల్ల మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బస్ షెల్టర్లు లేకపోవడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదుతో పాటు 1999లో భూసేకరణకు సంబంధించిన లేఖ కాపీని, ప్రస్తుత పరిస్థితిని చూపే ఫోటోలను కూడా జతపరిచినట్లు ఆయన తెలిపారు. పోలీసులు తక్షణమే స్పందించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, ప్రజా ఆస్తిని కాపాడాలని, ప్రయాణికుల భద్రతకు ముప్పు లేకుండా చూడాలని ఆయన కోరారు.