19-01-2026 01:11:26 AM
మేడ్చల్, జనవరి 18 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలలో చైర్మన్ రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో చాలామంది నాయకులు నిరుత్సా హానికి గురయ్యారు. చైర్మన్ పదవి పై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకొని అందుకు అనుగుణంగా ముందుకెళ్లినవారు ఒక్కసారిగా నిరాశ చెందారు. కొందరు నాయకు లకు చైర్ పర్సన్ పదవి అనుకూలంగా వచ్చిన వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రాలేదు.
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడినవే. రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలు మున్సిపాలిటీలు జిహెచ్‌ఎంసి లో విలీనం చేయాలని భావించిన ప్రభుత్వం, రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామాలతో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసింది. కొన్ని గ్రామాలను కలిపి మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో మండలం ఎలా ఉంటుందో ఈ మున్సిపాలిటీలు అలా ఉన్నాయి. మొదటిసారి ఎన్నిక లు జరుగుతుండడంతో పలువురు ఆసక్తి చూపారు.
ఎల్లంపేట ఎస్టీ మహిళకు రిజర్వుడు..
ఎల్లంపేట మున్సిపాలిటీ ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. 24 వార్డులలో ఐదు వార్డులు కూడా ఎస్టీలకు రిజర్వుడు అయ్యాయి. ఐదు వార్డులకు మూడు పార్టీల వారు అభ్యర్థుల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ నుంచి విగ్నేశ్వర రెడ్డి, శ్రీరంగవరం మాజీ సర్పంచ్ విజయానంద రెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యురాలు శైలజ విజయానంద రెడ్డి ఆశించారు.
బి ఆర్ ఎస్ నుంచి బీసీ అయినా జనరల్ అయినా డబ్బులు మాజీ సర్పంచ్ రాజ మల్లారెడ్డి కుటుంబీకులు పోటీ చేయాలని భావించారు. డబ్బిల్పూర్ సొసైటీ మాజీ చైర్మన్ సురేష్ రెడ్డి కూడా పోటీ చేయాలని భావించారు. వీరికి సొంత గ్రామాల్లో వార్డు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది. బిజెపి నుంచి పోచయ్య ముదిరాజ్ తో పాటు మరొకరు పోటీ చేయాలని భావించారు. పోచయ్యకు శ్రీరంగవరంలో వార్డు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది.
మూడు చింతలపల్లిలో..
మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ నుంచి దోసకాయల వెంకటేష్, మంద శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, టిఆర్‌ఎస్ పార్టీ నుంచి డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మల్లేష్ గౌడ్, జగ్గం గూడా మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి ఆశించారు.
ఈ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు అయింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన మూడు చింతలపల్లి మాజీ సర్పంచ్ జాం రవి, కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మాపూర్ కు చెందిన బండి జగన్నాతానికి పోటీ చేసే అవకాశం కలిగింది. వీరికి సొంత గ్రామాల్లో వార్డు రిజర్వేషన్ కూడా అనుకూలంగా వచ్చింది.
అలియాబాద్ మహిళలకు..
అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవి మహిళలకు రిజర్వుడ్ అయింది. ఇక్కడ పోటీ ప్రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు తమ కుటుంబీకులను పోటీ చేయించడానికి సిద్ధమవుతున్నారు. అలియాబాద్ లో అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తుర్కపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, కంఠం కృష్ణారెడ్డి, బిఆర్‌ఎస్ నుంచి మలక్పేట్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తోపాటు ఇతర నాయకులు తమ కుటుంబీకులను పోటీ చేయించాలని భావిస్తున్నారు.