13-10-2025 07:28:51 PM
ఏఐసిసి అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో గుజరాత్ వేదికగా ప్రారంభమైన కాంగ్రెస్ సంఘటన్ శ్రియన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా నూతన డీసీసీ (డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ)ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఉంటుందని వరంగల్, హనుమకొండ జిల్లాల ఏఐసీసీ అబ్జర్వర నవజ్యోతి పట్నాయక్ తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాల అబ్జర్వర్ లుగా విచ్చేసిన దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో ఆర్డినేటర్ ఆదర్శ్ జైస్వాల్ లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే.ఆర్ నాగరాజు, ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ఉన్న అన్ని మండల ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, కార్యకర్తల సూచనలు,అభిప్రాయాలు కీలకం అని అన్నారు.
రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అదే తరహాలో దేశ వ్యాప్తంగా డీసీసీ ఎంపిక ఉంటుందని తెలిపారు.అనంతరం హనుమకొండ జిల్లా వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకుల అభిప్రాయాలను, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. రానున్న గ్రామ, మండల, జిల్లా స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం క్షేత్ర స్థాయిలో కృషి అవసరమని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాకి కార్డు పేరుతో ఎన్నికల నేపథ్యంలో ప్రజలను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతి కాంగ్రెస్ నాయకుడు దోఖా కార్డు పేరుతో సరైన సమాధానం ఇవ్వాలని 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 22 నెలల్లో ఏమి చేయనట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్, ఇ.వి శ్రీనివాస్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ , పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.