16-05-2025 01:03:13 PM
బ్రహ్మోస్ క్షిపణి సత్తాకు పాకిస్థాన్ తలవంచక తప్పలేదు
పాకిస్థాన్ కు ఆర్థిక సాయం చేస్తే.. ఉగ్రవాదులకు చేసినట్లే
న్యూఢిల్లీ: గుజరాత్ లోని భుజ్ వైమానిక స్థావరాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆర్మీ, వాయుసేన, బీఎస్ఎఫ్ సిబ్బందితో రాజ్ నాథ్ సింగ్ ముచ్చటించారు. భుజ్ పర్యటనలో రాజ్ నాథ్ సింగ్ తో పాటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎ.పి.సింగ్ ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)లో వాయు సేన ప్రధానపాత్ర వహించిందని, ఎయిర్ ఫోర్స్ ధైర్యం పరాక్రమం ప్రదర్శించిందని పేర్కొన్నారు. కేవలం 23 నిమిషాల్లోనే పాక్ ఉగ్ర స్థావరాలను భారత వాయు సేన ధ్వంసం చేసిందని వివరించారు.
ఉగ్రవాదులను ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం(Prime Minister Narendra Modi's leadership) నూతన సందేశం పంపిందని చెప్పారు. భారత వాయుసేన స్థావరాలను పాకిస్థాన్ డ్రోన్లు ఏమీ చేయలేకపోయాయని రక్షణమంత్రి వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణి సత్తాకు పాకిస్థాన్ తలవంచక తప్పలేదని చెప్పారు. మన అత్యాధునిక ఆయుధాలు అన్ స్టాపబుల్ గా దూసుకెళ్లాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ లో మన సత్తా ప్రపంచమంతా చూసిందని తెలిపారు. పాకిస్థాన్ కు ఏ ఆర్థికసాయం చేసినా ఉగ్రవాదులకు చేసినట్లే.. ఉగ్రవాదులకు పాక్ సాయం చేస్తూ ప్రపంచానికి ముప్పు కలిగిస్తోందని రాజ్ నాథ్ సింగ్( Rajnath Singh) స్పష్టం చేశారు. పాక్ కు ఆర్థికసాయంపై ఐఎంఎఫ్ పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. శాంతికి విఘాతం కలిగిస్తే ఉపేక్షించమని ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించామన్నారు. పాక్ లోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగల సామర్థ్యం భారత్ ఉందని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా 'నయా భారత్' అంటే ప్రపంచానికి తెలిసిందని వెల్లడించారు.