calender_icon.png 28 August, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెలికాప్టర్ పంపించి ఉంటే.. వాళ్ళు ప్రాణాలతో దక్కేవారు: హరీశ్ రావు

28-08-2025 02:15:14 PM

హైదరాబాద్: రోమ్ తగలబడుతుంటే రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీరు ఫిడేల్ వాయించినట్లు ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(BRS MLA Harish Rao ) మండిపడ్డారు. భారీ వర్షాలతో ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతుంటే.. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నిన్న మూసీ సుందరీకరణ మీద, ఇవ్వాళ పొద్దున లేచి ఆటల పోటీల మీద రివ్యూ నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా ముంపు ప్రాంతాల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి హరీశ్ రావు గురువారం పర్యటించారు. రాజాపేట గ్రామంలో వరద ప్రవాహంలో గల్లంతు అయిన ప్రాంతాన్ని సందర్శించారు. రాజాపేట గ్రామంలో వరదలో చిక్కుకొని చనిపోయిన సత్యం కుటుంబాన్ని హరీష్ రావు బృందం పరామర్శించింది.  ఈ సందర్బంగా మాట్లాడుతూ.. 

మెదక్, కామారెడ్డి వరద(Medak, Kamareddy floods) ప్రవాహంలో ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి మూసీ సుందరీ కరణ, ఆటల పోటీల అంశంపై రివ్యూ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక మంత్రి అయితే అత్యవసరమైతే తప్ప హెలికాప్టర్ వాడలేమని అంటున్నారని విమర్శించారు. మెదక్ జిల్లా రాజాపేట్ వరదల్లో చిక్కుకొని ఇద్దరు కరెంటు పోల్ ఎక్కి నాలుగైదు గంటలుగా సహాయం కోసం ఎదురుచూసారని చెప్పారు. హెలికాప్టర్ పంపించి ఉంటే వాళ్ళు ప్రాణాలతో బయటపడేవారిని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రెండు కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, నష్టపోయిన పంట పొలాలకు ఎకరానికి రూ. 25000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని తెలిపారు.  మెదక్ ముంపు ప్రాంతాలకు ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తాగునీరు లేకపోవడంతో వర్షం నీరు తాగుతున్నారని చెప్పారు. ధూప్ సింగ్ తాండా ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సూచించారు. ప్రభుత్వం ఇప్పటికి అయిన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.