7 May, 2026 | 3:08 AM

వడ్ల కొనుగోళ్లలో జాప్యం వీడాలి

07-05-2026 02:06 AM
  1. కోనరావుపేటలో రైతులు, బీఆర్‌ఎస్ భారీధర్నా
  2. మర్రిలో రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  3. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిర్లక్ష్యంపై ఆగ్రహం

కోనరావుపేట, మే 6 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వడ్ల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు భారీస్థాయిలో ఆందోళన చేపట్టారు. మండలంలోని మర్రి ప్రాంతంలో రోడ్డుపై బైఠా యించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుక తరలింపునకు వందల సంఖ్యలో లారీలు అందుబాటులో ఉన్నప్పటికీ, వడ్ల తరలింపునకు మాత్రం లారీలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు మండిపడ్డారు.

అకాల వర్షాల తో ధాన్యం కుప్పలు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గృహప్రవేశ కార్యక్రమాలకు వెళ్లేందుకు సమయం ఉంటే, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు, కొనుగోలు కేంద్రాలకు రావడానికి సమయం లే దా అని ప్రశ్నించారు. రైతు కష్టాలను పట్టించుకోని ప్రభుత్వ వైఖరిపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వ హయాంలో ధాన్యం సేకరణ వేగంగా జరిగేదని, ప్రస్తుతం కొనుగో ళ్లలో జాప్యం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రైతులు నినదించారు. రోడ్డుపై రైతులు బైఠాయించడంతో వాహన రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. ఈ ఆందోళనలో వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.