వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రహరీ కూల్చివేత
కబ్జాలకు బాటలు వేస్తున్నారా?
గద్వాల టౌన్ మే 11 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రహరీ గోడను ఉద్దేశపూర్వకంగా కూల్చివేయడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.మార్కెట్ యార్డ్కు చెందిన విలువైన స్థలాలను ఆక్రమించుకునే లక్ష్యంతోనే ఈ చర్యలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.గోడను ధ్వంసం చేయడం వెనుక కబ్జాదారుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై రైతులు,ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోడ కూల్చివేతతో మార్కెట్ యార్డ్ భూముల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు.ఇప్పటికే కొంతమంది ఆక్రమణదారులు స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,అధికారులు స్పందించి కూల్చివేతకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ యార్డ్ భూములను కాపాడాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






