22-11-2025 05:36:12 PM
హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో 20 ఎకరాల్లో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందనిన పేర్కొన్నారు. మా ప్రభుత్వం “విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం” అన్న నమ్మకంతో, రాష్ట్రంలోని విద్యావ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తోందని తెలిపారు. వైరాలో నిర్మిస్తున్న ఈ స్కూల్ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా, ఒక గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు.
విద్యతో పేదల జీవితాలు మారతాయని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూళ్లను నిర్మించాలన్న లక్ష్యంతోనే వైరాలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే ఉండే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, మా ప్రభుత్వం వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి, క్రీడా కార్యక్రమాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని ఈ సమగ్ర ఇంటిగ్రేటెడ్ స్కూల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు.
స్కూల్ నిర్మాణానికి కావాల్సిన నిధుల్లో ఇప్పటికే రూ.30 కోట్లు జమ చేశామని, పనులు వేగంగా సాగేందుకు ప్రతి 15 రోజులకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ, రెసిడెన్షియల్ హాస్టళ్లలోని విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని గుర్తు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకున్నామని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకునే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యతోనే సమాజం ఎదుగుతుందని, విద్యార్థుల భవిష్యత్ బలపడే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.