22-11-2025 05:39:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 23 ఆదివారం రోజున జరిగే నేషనల్ మీన్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు నిర్మల్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి అయినట్లు నిర్మల్ జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. జిల్లాలోని 84 ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల నుండి 1043 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష కొరకు ఖానాపూర్ లో బాలికల పాఠశాల, నిర్మల్ లో జిమిరాస్పేట్ పాఠశాల, కస్బా పాఠశాల, బైంశాలో ఆశ్రమ బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలుర పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.
ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతున్నదని వెల్లడించారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు .ఒక నిమిషం కూడా ఆలస్యమైతే అనుమతించే ప్రసక్తి లేదని వెల్లడించారు. ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్ ,సెంటర్ లేవల్ అబ్జర్వర్ లతోపాటు చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. పరీక్ష జరిగే సమయంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిరాక్స్ సెంటర్లన్నీ మూసి వేయబడి ఉంటాయని వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలలో మెడికల్ సిబ్బంది ఉంటారని చెప్పారు .పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.