10-05-2025 12:29:12 AM
ఖనిజ అన్వేషణకు సంసిద్ధంగా ఉండండి
వనరులోనూ సింగరేణి సత్తా చాటాలి
భవిష్యత్తు విస్తరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
హైదరాబాద్,(విజయక్రాంతి): బొగ్గు రంగంలో అగ్రస్థానంలో ఉన్న సింగరేణి రానున్న రోజుల్లో క్రిటికల్ మినరల్స్, సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో ప్రవేశించి తన సత్తాను చాటాలని, 136 సంవత్సరాల మైనింగ్ అనుభవాన్ని ఉపయోగించుకొని సంస్థ భవిష్యత్తుకు సుస్థిర ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సింగరేణి భవిష్యత్తు విస్తరణ ప్రాజెక్టులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. గ్రాఫేట్, లిథియం, కాపర్ తదితర ఖనిజాలకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటి అన్వేషణకై ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. ఇందుకోసం ఇప్పటికే కన్సల్టెంట్ ఏజెన్సీలను నియమించుకొని ముందుకు వెళుతుండటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ విషయంలో అనుభవజ్ఞులైన అధికారుల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు అలాగే సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్నందున సింగరేణి ప్రాంతాల్లోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలలో అందుబాటులో ఉన్న అవకాశాల అన్వేషణకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగాలన్నారు. అలాగే రాజస్థాన్ తో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు విద్యుత్, సోలార్ ప్లాంట్ ఏర్పాట్లపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సి&ఎండి ఎన్ బలరాం నాయక్, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్, సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభాని తదితరులు పాల్గొన్నారు.