30 July, 2026 | 12:27 AM

భూవివాదంలో డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్

29-05-2024 01:45 AM

భూ కబ్జా, హత్యాయత్నం కేసు నమోదు

సిద్దిపేట, మే28(విజయక్రాంతి): అధికారం, పలుకుబడి ఉపయోగించి ఆక్రమంగా భూమి కబ్జా చేసిన సంఘటనలో ఇద్దరు అన్నదమ్ములను సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ డాక్టర్ అనురాధ మంగళవారం రాత్రి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట పట్టణం వడ్డెర కాలనికి చెందిన అలకుంట అశోక్ (సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటి తహసీల్దార్), అలకుంట మహేందర్‌లు పట్టణంలోని 1465 సర్వే నంబరులో వీరి సమీప బంధువులకు చెందిన భూమిని నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

రాజకీయ పలుకుబడితో ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకుని బోరు వేశారు. దానికి విద్యుత్ మీటరు తీసుకున్నారు. అందులో సీసీ కెమోరాలు బిగించారు. ఈ నెల 24వ తేదీన ఈ భూమి తమదే అని కరీంనగర్‌కు చెందిన నషీంఖాన్, సిద్దిపేటకు చెందిన అతీఫ్‌లు అక్కడికి వెళ్లగా నిందితులు అశోక్, మహేందర్ మరికొంత మంది కలిసి వారిని బూతులు తిడుతూ, కొడుతూ, కత్తులతో బెదిరించారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మహేందర్ నుంచి కత్తి స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.