26-01-2026 03:46:34 PM
దేవరకొండ,(విజయక్రాంతి): దేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు పురస్కారాలను అందజేసింది. ఇందులో భాగంగా దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ జహంగీర్ తన అంకితభావంతో కూడిన సేవలకు గాను జిల్లా స్థాయి ఉత్తమ ఉద్యోగి అవార్డుకు ఎంపికయ్యారు. వేడుకల అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ చేతుల మీదుగా జహంగీర్ ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
మున్సిపల్ పరిధిలో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే కాకుండా, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ సకాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి జహంగీర్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన ప్రదర్శిస్తున్న క్రమశిక్షణ, నిబద్ధత తోటి సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం వంటి ప్రతిష్టాత్మక వేదికపై జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం పట్ల జహంగీర్‌పై అభినందనల జల్లు కురుస్తోంది. మున్సిపల్ ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.