26-01-2026 06:22:23 PM
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని దేశభక్తి నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్వీనర్ అర్జున్ సాతర్ల మాట్లాడుతూ... 1950 జనవరి 26న భారతదేశం రాజ్యాంగాన్ని స్వీకరించి ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని గుర్తు చేశారు.
గణతంత్ర దినోత్సవం అనేది కేవలం పండుగ మాత్రమే కాకుండా, రాజ్యాంగం మనకు అందించిన హక్కులు, స్వేచ్ఛలతో పాటు దేశం పట్ల మనపై ఉన్న విధులు, బాధ్యతలను గుర్తు చేసే అత్యంత ప్రాముఖ్యమైన దినమని తెలిపారు.విద్యార్థుల్లో జాతీయ భావనను, రాజ్యాంగ విలువలను పెంపొందించడమే ఏబీవీపీ ప్రధాన లక్ష్యమని, దేశ ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఏబీవీపీ నిరంతరం పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులు కాలరాయబడినప్పుడు రాజీపడకుండా ప్రశ్నించడమే నిజమైన గణతంత్ర స్పూర్తి అని పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువలను కాపాడుతూ స్వాభిమానంతో కూడిన బలమైన భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులను చైతన్యవంతం చేసి దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు నడిపించడంలో ఏబీవీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థి త్రివర్ణ పతాకం కింద ఐక్యంగా నిలబడి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వికసిత భారత నిర్మాణానికి కట్టుబడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికన్నా గొప్పదైన దేశమని, భారతదేశాన్ని పోల్చాలంటే మరో భారతదేశమే ఉండాలని వ్యాఖ్యానించారు.
జాతీయ జెండా గౌరవం కోసం ఎంతో మంది విద్యార్థి పరిషత్ నాయకులు ప్రాణాలర్పించారని, వారి ఆశయాలను కొనసాగించడం నేటి విద్యార్థుల బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ విభాగ ప్రతినిధి గోవిందు గుప్తా, నగర కార్యదర్శి కార్తీక్, టౌన్ సంయుక్త కార్యదర్శి బంటి, శంకర్, నందకిషోర్, సంతోష్, పరమేష్, మురళి, మహబూబ్, జగదీష్ తదితర ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.