01-12-2025 07:28:13 PM
స్థానిక సంస్థల ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థులను గెలిపించుకోవాలి
బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
గంభీరావుపేట,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి మోసం చేసే కాంగ్రెస్, బిఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులను కాకుండా బిజెపి పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సోమవారం గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి హాజరై మాట్లాడుతూ... గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 5 లక్షల అభివృద్ధి నిధులు ఇస్తామని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు. తమ జేబు నుంచి డబ్బులు పెట్టి పనులు చేపట్టిన సర్పంచులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అభివృధి చేద్దామంటే డబ్బులు లేవని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించాడని, ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచ్‌గా గెలిపించినా అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు.
కేటీఆర్ ఫోటోల మనిషి
ఇక ఎగువ మానేరు వరదల సమయంలో రైతులు ఇబ్బందుల్లో ఉండగా, స్థానిక ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు సహాయక బృందాలు చేరుకున్నాయని, కానీ కేటీఆర్ కేవలం ఫోటో కోసం మాత్రమే వచ్చారని ఆరోపించారు.బండి సంజయ్ ప్రత్యేక చొరవతో లింగన్నపేట–కోరుట్లపేట మధ్య 17 కోట్లతో డబుల్ రోడ్డు, గంభీరావుపేట–మల్లారెడ్డిపేట మధ్య 7 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులు, పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, వివిధ కుల సంఘాల భవనాలకు మరియు అంగన్వాడీ కేంద్రాలకు కేంద్ర నిధులు తీసుకురావడం కూడా బండి సంజయ్ కృషి ఫలితమేనని అన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలుపును అందించాలని కోరారు.