24-11-2025 12:59:19 AM
జోహన్నెస్‌బర్గ్, నవంబర్ 23: పరస్పర సహకారంతోనే దేశాల అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో మోదీ భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, మైనింగ్, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ (ఏఐ), ఆహార భద్రత వంటి అంశాలపై చర్చించారు. సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోనూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, అందుకు రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరగాలని మోదీ ప్రతిపాదించారు.
ఇదే సమయంలో భారత్‌కు చిరుతపులులను తరలించేందుకు దక్షిణాఫ్రికా అందించిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’లో చేరాలని రామఫోసాను మోదీ సాదరంగా ఆహ్వానించారు. 2026లో భారత్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు దక్షిణాఫ్రికా సంపూర్ణ మద్దతు ఇస్తుందని రామఫోసా హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా ఆతిథ్యం, సదస్సు విజయవంతం అయిన తీరుపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపిస్తూ ‘ఎక్స్’ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.
‘మాకు ముందే ఎందుకు చెప్పలేదు’:రామఫోసా
జీ20 శిఖరాగ్ర సదస్సు చివరి రోజు ఒక ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా మధ్య జరిగిన ద్వుపాక్షిక భేటీలో సదస్సు నిర్వహణ బాధ్యతలపై రామఫోసా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిలో నవ్వులు పూయించాయి. సదస్సు విజయవంతంగా ముగిసిన అనంతరం ప్రధాని మోదీతో రామఫోసా భేటీ అయి..
జీ20కి ఆతిథ్యం ఇవ్వడం ఇంత కష్టమైన పనని భారత్ తమకు ముందే చెప్పి ఉండాల్సిందని, అలా చెప్పి ఉంటే తాము ఆ బాధ్యతల నుంచి పారిపోయేవాళ్లమేమోనని చమత్కరించారు. గతంలో భారత్ జీ20ని అద్భుతంగా నిర్వహించిందని, దాంతో పోలిస్తే తమ ఏర్పాట్లు సాదాసీదా అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ ‘ఏర్పాట్లు సాదాసీదావైనా గొప్పగా ఉన్నాయి’ అని కితాబునిచ్చారు.