24-11-2025 12:57:56 AM
ఢిల్లీవాసుల ఆందోళన
న్యూఢిల్లీ, నవంబర్ 23: నగరం విష వాయువులతో కూడిన గ్యాస్ ఛాంబర్‌గా మారిందని, తాము ఊపిరి పీల్చుకోలేకపోతున్నామని ఢిల్లీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాయని, తమకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాల్సిందేనని రోడ్డెక్కారు. ఈమేరకు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద పర్యావరణ వేత్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రు లు ఫ్లకార్డులు చేబూని నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు ఇకనైనా రాజకీయాలను పక్కనపెట్టి, ప్రజారోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాధారణంగా గాలి నాణ్యత ప్రమాణాల ప్రకారం.. గాలిలో కాలుష్య సూచీ 0 50 మధ్య ఉంటే ఫర్వాలేదు. అది కాస్త 100కి చేరిందంటే ప్రమాదం. కానీ, ప్రస్తుతం ఢిల్లీ లో ఏకంగా 400 పాయింట్లకు చే రింది. అంటే.. సురక్షిత మోతాదు కంటే ఢిల్లీలో కాలుష్యం 10 15 రెట్లు ఎక్కువగా ఉంది. వాతావరణంలో ధూళి రేణువుల సాంద్రత ప్రమాదకర స్థాయిని మించిందని, అది ఆరోగ్యవంతులను సైతం అనారోగ్యం పాలుచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.