జాంగీలో బంగారం... నూడుల్స్‌లో డైమండ్స్

24-04-2024 12:05:00 AM

ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

ముంబై, ఏప్రిల్ 23: కస్టమ్స్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉండి స్మగ్లర్లకు చుక్కలు చూపిస్తున్నా.. కొత్త కొత్త దారులను వెతుక్కుంటున్నారు అక్రమార్కులు. ముంబై ఎయిర్‌పోర్టులో పలువురు వ్యక్తులు వేర్వేరుగా అండర్‌వేర్‌లో బంగారం, నూడుల్స్ లో వజ్రాలను దాచిపెట్టి తీసుకొచ్చా రు. వీటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఏకంగా రూ.6.46 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మొత్తం 8 మందిని అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.4.44 కోట్ల విలువైన 6.8 కేజీల బంగారం, రూ.2.02 కోట్ల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఓ వ్యక్తి నూడుల్స్ ప్యాకెట్‌లో వజ్రాలు దాచిపెట్టగా అధికారులకు పట్టుబడ్డాడు. ఇక కొలంబో నుంచి ముంబై వచ్చిన విదేశీయుడు 321 గ్రాముల బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అండర్‌వేర్‌లో దాచుకుని వచ్చాడు. అయినా కూడా కస్టమ్స్ అధికారులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.