calender_icon.png 2 September, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఐ రీ ఎంట్రీ!

02-09-2025 12:48:49 AM

  1. రాష్ట్ర ప్రభుత్వం నిషేధం వాపస్ 
  2. కాళేశ్వరం కేసు విచారణలో కీలక నిర్ణయం
  3. కేంద్ర హోం శాఖకు లేఖ రాయనున్నట్టు సమాచారం

హైదరాబాద్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి) : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) తెలంగాణలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నది. కాళే శ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం దోషులను నిగ్గుతేల్చే బాధ్యత సీబీఐకి అప్పగించడంతో, ప్రస్తుతం తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తెలంగాణలో సీబీఐ దర్యాప్తు చేయడంపై ఇప్పటికే నిషేధం ఉండటంతో దానిని ఉపసంహరించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

2022లో రాష్ట్రంలో రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిషేధం విధించగా, ప్రస్తుతం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రక్రియను అనుసరించనున్నది. రాష్ట్రంలోకి సీబీఐ రావడానికి అనుమతి ఇస్తూ కేంద్ర హోం శాఖకు సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ అధికారులు లేఖను రాసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

అసెంబ్లీలో కాళేశ్వరం పై చేసిన తీర్మానం కాపీతోపాటు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలను జత చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతో పాటు సీబీఐ దర్యాప్తు పరిధిలోకి మిగాతా ప్రాజెక్టులను కూడా తీసుకురానున్నార అనే విషయంపై స్పష్టత లేదు.

2022లో నిషేధం..

రాష్ట్రంలో సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్)ను తెలంగాణ ప్రభుత్వం 2022లో ఉపసంహరించుకున్నది. అప్పుడు జరిగిన బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యేల ఫాంహౌస్ కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ కేసులో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగలబోతున్నదని పెద్దఎత్తున ప్రచారం సాగినప్పటికీ పరిణామాలు వెనువెంటనే మారిపోయాయి. కేసీఆర్ మీడియాకు సమర్పించిన ఆధారాలు సరిగా లేకపోవడంతో రాష్ర్టంలోకి సీబీఐ రాబోతుందని ప్రచారం జరిగింది.

దీంతో అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రంలోకి సీబీఐని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీవో 51ని జారీ చేశారు. జనరల్ కన్సెంట్ ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ర్టంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు అప్ప టి హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఏ కేసులోనైనా దర్యాప్తు కోసం సీబీఐ తెలంగాణలోకి ప్రవేశించానికి వీలులేకుండా పో యింది. సీబీఐని అనుమతించకుండా నోటిఫికేషన్ జారీచేసే అధికారం రాష్ట్రాలకు ఉం టుంది.

అయితే ఏదైనా కేసులో హైకో ర్టు, సుప్రీంకోర్టు ఆదేశిస్తే రాష్ట్రాలు అనుమతి ఇవ్వకపోయినా సీబీఐకి విచారణ జరిపే అధికారం ఉంటుంది. తెలంగాణ గడ్డపై సీబీఐని అడుగుపెట్టనివ్వకుండా మాజీ సీఎం కేసీఆర్ అడ్డుకట్ట వేస్తే ఇప్పుడు సీఎం రేవంత్‌సీబీఐకి ఎంట్రీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నది.