02-09-2025 12:46:09 AM
మండలి చైర్మన్ పోడియం వద్ద ఎమ్మెల్సీల ఆందోళన
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): శాసనమండలిలో సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగిస్తూ శాసనసభ ఆదివారం నిర్ణయించిన నేపథ్యంలో, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తాతా మధు, దాసోజు శ్రవణ్, నవీన్ కుమార్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, వాణిదేవి, ఎల్ రమణ, మధుసూదనాచారి మరికొంత మంది సభకు నల్ల కండువాలు ధరించి వచ్చారు.
బిల్లులు ప్రవేశపెట్టిన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులంతా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పోడియం వద్దకు దూసుకొచ్చి రభస చేశారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను చించి మండలి చైర్మన్ వైపు, కెమెరాలవైపు విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు.
‘రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు’, ‘బాబు, మోదీ డైరెక్షన్.. రేవంత్‌రెడ్డి యాక్షన్’, ‘బడే భాయ్.. ఛోటే భాయ్ ఏక్‌హై.. ఎంక్వైరీ ఫేక్‌హై’ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, బల్మూరి వెంకట్ సైతం వారి స్థానాల్లో నిలబడి ‘కేసీఆర్ వద్దు.. బీసీలు ముద్దు’, ‘బీసీల వ్యతిరేకి బీఆర్‌ఎస్’ అంటూ నినాదాలు చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు దూసుకురావడంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మార్షల్స్ వచ్చి బీఆర్‌ఎస్ సభ్యులను అడ్డుకొనే ప్రయ త్నం చేయగా.. బీఆర్‌ఎస్ సభ్యులు వారిని ప్రతిఘటించారు. చైర్మన్ గుత్తా మాట్లాడుతూ.. పోడియం వద్దకు రావొద్దని, మీమీ స్థానాల్లో నిలబడి నిరసన తెలుపుకోవచ్చని వారికి సూచించారు. బీఆర్‌ఎస్ సభ్యులు కడుపులో కత్తు లు పెట్టుకున్నారని మంత్రి పొన్నం విమర్శించారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వీరికి ఇష్టం లేనట్టుందని ఆరోపించారు. విచారణను ధైర్యంగా ఎదుర్కోవాల్సింది పోయి ఇలా ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. బీసీల అంశం సభకు వచ్చినప్పుడు బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేయడం సరికాదని, ఇది బీసీల భావోద్వేగమని, సహకరించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభ్యర్థించారు. వీరి దుశ్చర్యను బీసీ సమాజం సహించదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని మండలిని కోరారు.
ప్రభుత్వం బీసీలకు చిత్తశుద్ధితో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. అనంతరం మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టిన మున్సిపల్, పంచాయతీరాజ్, ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లులు ఆందోళన నడుమే ఆమోదం పొందాయి. సభ ప్రారంభమైన దాదాపు గంటకే చైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.