14-01-2026 12:00:00 AM
బంగ్లాదేశ్ క్రికెట్ కష్టకాలాన్ని కొనితెచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తున్నది. ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృశ్యా తాము భారత్‌లో ప్రపంచకప్ ఆడలేమని, మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను మార్చాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి విజ్ఞప్తి చేసింది. కానీ ఐసీసీ మాత్రం బీసీబీ పేర్కొన్న కారణాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడడంలో బంగ్లా ఆటగాళ్లకు భద్రతాపరంగా ముప్పు లేదని, వేదికలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
అయితే మంగళవారం ఐసీసీ అధికారులతో సమావేశమైన బీసీబీ టీ20 ప్రపంచకప్ ఆడేందుకు భారత్‌కు వెళ్లకూడదన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించడం గమనార్హం. నిరుడు బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా పదవీచ్యుతురాలయ్యాక, ఆ దేశంతో భారతదేశ దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అక్కడి యువత భారత్‌పై విద్వేషం వెళ్లగక్కుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను చూసి భారత్‌లోనూ చాలామంది భగ్గుమంటున్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌కు ఎంపిక చేయడంపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ వెంటనే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.
దీనికి ప్రతిగా భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ బంగ్లా క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచకప్ కోసం జట్టును పంపలేమని పేర్కొంది. అంతేకాదు భారత్‌లో జరిగే ఐపీఎల్ ప్రసారాలను కూడా తమ దేశంలో నిలిపేస్తున్నామని ఇది వరకే ప్రకటించింది. అయితే బీసీబీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. ప్రపంచ క్రికెట్ ఆదాయంలో 70 శాతానికి పైగా వాటా కలిగిన బీసీసీఐ అభీష్టానికి వ్యతిరేకంగా ఐసీసీ వ్యవహరించే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బీసీసీఐని కాదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముందుకు సాగడం అనేది కష్టమే. మన జట్టు ఆ దేశానికి వెళ్లినా, బంగ్లా జట్టు మన దగ్గరికి వచ్చినా బీసీబీకి వందల కోట్లలో ఆదాయం సమకూరుతుంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్ బహిష్కరిస్తే, ఆ టోర్నీ ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు ఐసీసీ తీసుకోబోయే క్రమశిక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.
2008 ముంబయి ఉగ్రదాడుల తర్వాత టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించడం మానేసింది. పాక్‌లో పరిస్థితులు క్షీణించడంతో విదేశీ జట్లు వెళ్లడం మానేశాయి. దీంతో ఆ దేశంలో జరగాల్సిన ఐసీసీ టోర్నీలన్నీ తరలిపోవడంతో ఆదాయం లేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇదే రీతిన వ్యవహరిస్తే మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డులాగే ఆదాయం కోల్పోయి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక బంగ్లాలో జరుగుతున్న ఆందోళనల్లో కీలకపాత్ర పోషిస్తున్న జెన్‌జెడ్ యువత బంగ్లా క్రికెట్ జట్టును భారత్‌కు పంపొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. యువత భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే తమ దేశ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆ దేశానికే చెందిన మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ లాంటి ఆటగాళ్లు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిణామాలతో బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.