08-05-2025 12:00:00 AM
కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు
మహబూబాబాద్, మే 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని, రైతులకు ఇబ్బందులకు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల నుండి తాను వివిధ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించగా , రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తను దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.
అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నందున వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు యుద్ధ ప్రాతి పదికన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో మహ బూబాబాద్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలవడానికి కృషిచేసిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డిని ఎమ్మెల్సీ సత్కరించారు. ఎమ్మెల్సీ వెంట మునిసిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మారినేని వెంకన్న తదితరులున్నారు.