08-05-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, మే 7(విజయక్రాంతి): ఇందిరమ్మ గృహాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసే విషయంలో స్థానిక వనరులను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడంపై జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం హౌసింగ్, మైనింగ్, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ ,రెవిన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లక్ష 74 వేల క్యూబిక్ మీటర్లు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అవసరం ఉంటుందని, స్థానిక వనరుల ద్వారా ఇసుక సరఫరాకు గ్రౌండ్ వాటర్, రెవెన్యూ, మైన్స్ శాఖల సమన్వయం ద్వారా జాయింట్ సర్వే నిర్వహించాలన్నారు. ఇసుక రీచ్ లు మన జిల్లాలో లేనందున స్థానిక వనరుల స్ట్రీమ్స్ నుండి గుర్తించి లబ్ధిదారుని ఇంటి దగ్గరే ఇసుక సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
స్థానిక వనరుల ద్వారా ఇసుక సరఫరా చేసే విషయంలో తహసిల్దార్లు ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ఎన్ని క్యూబిక్ మీటర్లు అవసరం ఉంటుందో దాని వరకే అనుమతి మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ భుజంగరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, ఆర్డీవోలు రమాదేవి, జయచంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, మైనింగ్ అసిస్టెంట్ జువాలజిస్ట్ మధు కుమార్, ఆర్‌ఐ లక్ష్మీనారాయణ, సంబంధిత తహసిల్దారులు, రెవెన్యూ సిబ్బందిపాల్గొన్నారు.