ఒట్ల రాజకీయాలు!

27-04-2024 02:28:53 AM

n దేవుడి పేరు చెప్పి ఒకరు.. దేవుళ్లపై ఒట్టు వేసి మరొకరు.. n  దమ్ముంటే అధికారంలో ఉన్నప్పుడు చేసి చూపించాలి n  కాంగ్రెస్, బీజేపీ అవసరాలను బట్టి ఒక్కటే

n  నా కళ్ళముందు తెలంగాణ నాశనమైతే ఊరుకోను

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : దేవుడి పేరు చెప్పుకొని ఒకరు ఓట్లు అడుక్కొంటుంటే.. దేవుడిపై ఒట్లు వేస్తూ మరొకరు ఓట్లు అడుగుతున్నారని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలనే దమ్ముంటే అధికారంలో ఉన్నప్పుడు చేయాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సు యాత్ర శుక్రవారం జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నది. పట్టణంలోని అప్పన్నపల్లి నుంచి మెట్టుగడ్డ, న్యూటౌన్, బస్టాండ్, అశోక్‌టాకీస్ చౌరస్తా మీదుగా క్లాక్‌టవర్ వరకు బస్సు యాత్ర సాగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ఎవరికైనా న్యాయం చేసిందా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఇప్పటివరకు  వంద నినాదాలిచ్చినా ఒక్కటీ నిజం కాలేదని ఆరోపించారు.

మేకిన్ ఇండియా, సబ్‌కావికాస్, డిజిటిల్ ఇండియా, అచ్చేదిన్ వచ్చాందా ? సచ్చే దిన్‌వచ్చింది.. ఆత్మనిర్భర్ భారత్ అయిందా? జనధన్ యోజనతో ఎవరికైన లాభం జరిగిందా? అని ప్రశ్నించారు. బీజేపీని తెలంగాణలో ఆదరించాలిఆ్సన అవసరం లేదని అన్నారు.  పీఎం నరేంద్ర మోదీ విశ్వగురు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఎవరికీ వారే బిరుదులు అవార్డులు ఇచ్చుకుంటే అందరూ అలా పిలుస్తారా అన్ని నిలదీశారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సిన 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,  వాటిని ఎప్పుడు  నింపుతున్నారని ప్రశ్నించారు.  రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా ఇప్పటివరకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదని ఆరోపించారు.  

విభజన హామీలేవి?

విభజన చట్టంలో మనకు రావాల్సిన ఎన్నో హక్కులను బీజేపీ ప్రభుత్వం ఇవ్వ నిరాకరించిందని కేసీఆర్ దుయ్యబట్టారు. మన రాష్ట్రంలో ఉన్న 7 మండలాలను గుంజుకుని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని విమర్శించారు. ఆంధ్రవాళ్ళు మన నీళ్ళు ఎత్తుకుపోతుంటే డీకే అరుణ పోయి మంగళహారతి ఇచ్చి మంచిగా తెలంగాణ నీళ్ళు తీసుకుపోతున్నావు మంచిగా తీసుకుపో అని చెప్పారని ధ్వజమెత్తారు. బీజేపీ వాళ్ళు మనకు అక్కరకు రాని చుట్టాలు అని అన్నారు. తర ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణను నాశనం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోనని, ప్రాణం ఫణంగా పెట్టి  తెచ్చిన తెలంగాణలో అందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చోటాబాయి..పీఎం నరేంద్రమోదీ బడేబాయి ఇద్దరు ఒక్కటే అని కేసీఆర్ అరోపించారు.  ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టేంరాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

బీఆర్‌ఎస్ సమన్వయకర్తల నియామకం

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియో జకవర్గాలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే తారక రామారావు శుక్రవా రం సమన్వయకర్తలను నియమించారు. జూబ్లీహిల్స్‌కు షేక్ అబ్దుల్లా సోహెల్, సికింద్రాబాద్ రాజీవ్‌సాగర్, అంబర్‌పేట దాసోజు శ్రవణ్,  సనత్‌నగర్ వెంకట్‌రెడ్డి, ముషీరాబాద్ పి.విష్ణువర్ధన్‌రెడ్డి, నాంపల్లి మహ్మద్ అలీ, ప్రభాకర్‌రావు, ఖైరతాబాద్‌లో ఎంఎన్  శ్రీని వాస్‌రావుకు బాధ్యతలు అప్పగించారు.

డివిజన్లకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. 

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు కేటీఆర్ ఇన్‌చార్జ్‌లను నియమించారు. వెంకటేశ్వర కాలనీకి కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, ఖైరతాబాద్‌కు మన్నె గోవర్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్‌కు కార్పొరేటర్ వెంకటేష్, బంజారాహిల్స్‌కు విప్లవ్‌కుమార్, హిమాయత్ నగర్‌కు హేమలత బాబు యాదవ్, సోమాజిగూడకు ఆశిష్‌యాదవ్‌ను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.