06-05-2024 01:15:52 AM
ఈ నెల ఏడోతేదీన లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగుతుంది. అంటే మంగళవారం పోలింగ్ నిర్వహిస్తారు. ఈ దశలో 10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు వేయనున్నారు. గోవా, గుజరాత్, అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కీలక స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. గుజరాత్, కర్ణాటక, గోవాలో మూడో దశతో అన్నిస్థానాలకు పోలింగ్ ముగుస్తుంది. గుజరాత్‌లోని 26 స్థానాలకుగాను 25 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు సూరత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫేజ్‌లో అభ్యర్థుల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ దశలో పలువురు కుబేరులైన అభ్యర్థులు కూడా ఉన్నారు. వారి వివరాలు తెలుసుకొందాం.
పల్లవి డింపో
ఈమె గోవాలోని దక్షిణ గోవా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన నామినేషన్ అఫిడవిట్‌లో తన ఆస్తులు రూ.1361 కోట్లుగా పేర్కొన్నారు.
జ్యోతిరాధిత్య సింధియా
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన జ్యోతి రాధిత్య సింధియా తొలిసారి బీజేపీ తరఫున ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈ కేంద్రమంత్రికి కాషాయ పార్టీ నుంచి ఇవే తొలి ఎన్నికలు. ఆయన వారి సంప్రదాయ ఆస్థాన నియోజకవర్గమైన గుణ నుంచి పోటీ చేస్తున్నారు. మూడో దశంలో ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తులను రూ.424 కోట్లుగా చూపించారు.
ఛత్రపతి సాహూ మహరాజ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్ రాజకుటుంబానికి చెందిన సాహు మహరాజ్ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మూడో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తులను రూ. 342 కోట్లుగా చూపించారు.
రంజిత్ నాయక్ నింబాల్కర్
నింబాల్కర్ బీజేపీ అభ్యర్థిగా మధా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మూడో దశలో పోలింగ్ జరుగనున్నది. నింబాల్కర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను రూ.205 కోట్లుగా పేర్కొన్నారు.
పూనాంబెన్ జాదమ్
ఈమె గుజరాత్‌లోని జామ్‌నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ.147 కోట్లుగా చూపించారు.
సంజయ్‌కాకా రామ్‌చంద్ర పాటిల్
ఈయన మహారాష్ట్రలోని సాంగ్లి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రామ్‌చంద్రపాటిల్ తనకు రూ.75 కోట్ల ఆస్తులున్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో చూపించారు.