దొందూ దొందే

07-05-2024 12:32:51 AM

బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదు

మాది పేదల ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి

ఖమ్మం , మే 6 (విజయక్రాంతి): పదేండ్లుగా దేశాన్ని పాలించిన బీజేపీ ప్రభుత్వం, మొన్నటి దాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోని బోనకల్‌లో  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తరఫున ప్రచారం చేశారు. రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో అధికా రంలో ఉండి మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతూ ప్రధాని మోదీ అందరినీ ముంచారని ఆరోపించారు. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉండీ అన్నీ నిర్వీర్యం చేశారని, ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగ వ్యవస్థనే దెబ్బతీస్తారని ఆందోళన వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా పరిపాలన సాగుతున్నదని, ముమ్మాటికీ తమది పేదల ప్రభుత్వమని స్పష్టంచేశారు. ప్రజలకు లబ్ధి కలిగేలా తమ విధానాలు ఉంటున్నాయని ఉద్ఘాటించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు రైతుబంధు వేశామని చెప్పారు. దద్దమ్మలు, సన్నాసులు.. అంటూ కేసీఆర్ పెద్ద పదాలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రె స్ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందా మని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నేత జెట్టి కుసుమకుమార్, సీనియర్ నాయకులు కోట రాంబా బు, జడ్పీటీసీ మోదుగు సుధీర్‌బాబు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.