06-05-2024 01:12:12 AM
న్యూఢిల్లీ, మే 5: మంగళవారం జరుగనున్న లోక్‌సభ ఎన్నికల మూడో దశలో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో కొందరు రాజకీయ వారసులు ఉండగా, మరికొందరు స్వతంత్రంగానే ఎదిగినవాళ్లు ఉన్నారు.
అమిత్‌షా
బీజేపీతోపాటు దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో ఒకరుగా ఎదిగిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో కూడా ఆయన ఇక్కడి నుంచే గెలిచారు. అమిత్‌షాపై కాంగ్రెస్ పార్టీ సోనాల్ పటేల్‌ను పోటీకి నిలిపింది. ఈ స్థానానికి మంగళవారం పోలింగ్ జరుగనున్నది. ఈసారి కూడా అమిత్‌షా సునాయా సంగా గెలుస్తారనే అంచనాలున్నాయి.
డింపుల్ యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్. ఆమె ప్రస్తుతం మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ స్థానం ఎస్పీకి కంచుకోటలాంటిది. దీంతో డింపుల్ గెలుపు నల్లేరు మీద నడకే అని అంటున్నారు.
జ్యోతిరాధిత్య సింధియా
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ రాజకుటుంబ వారసుడైన జ్యోతిరాధిత్య సింధియా గుణ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. పార్టీని చీల్చి కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. బీజేపీలో ఆయనకు ఇవే తొలి ఎన్నికలు.
అధిర్ రంజన్ చౌదరి
కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన అధిర్ రంజన్ చౌదరి గత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ బర్హాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఆయనపై బీజేపీ, టీఎంసీ బలమైన అభ్యర్థులనే పోటీలోకి దింపాయి. టీఎంసీ తరఫున మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పోటీలో ఉండగా, బీజేపీ కొత్త అభ్యర్థి నిర్మలా సాహాను రంగంలోకి దింపింది.
బద్రుద్దిన్ అజ్మల్
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అధ్యక్షుడు బద్రుద్దిన్ అజ్మల్ కూడా మూడో ఫేజ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈయన ధుబ్రి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2009 నుంచి ఈ స్థానంలో అజ్మల్ తిరుగులేని పట్టు సాధిస్తూ స్తున్నారు.
సుప్రీయా సూలే
మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానంలో ఈసారి ఆసక్తిరమైన పోరుకు తెరలేచింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చి అజిత్ పవార్.. బీజేపీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరిపోవటంతో అసలైన ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్‌తో వైరం మొదలైంది. శరద్‌పవార్ అన్నకొడుకైనా అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బారామతి నుంచి తన సతీమణి సునేత్ర పవార్‌ను పోటీలోకి దిం చారు. అదే స్థానం నుంచి శరద్‌పవార్ కుమా ర్తె, అజిత్‌పవార్‌కు సోదరి అయిన సుప్రియా సూలే కూడా పోటీలోకి దిగారు. దీంతో ఇక్కడ వదినా మరదళ్ల పోరు మొదలైంది.
శివరాజ్‌సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్‌కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి గా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈసారి లోక్‌సభ బరిలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినా.. ఆయనకు పార్టీ అధిష్ఠానం సీఎం పదవి ఇవ్వలేదు. పార్లమెంటుకు పంపి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ఇర్ణయించింది. ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే శివరాజ్‌సింగ్ క్యాబినెట్‌లో కీలక పదవి సంపాదిస్తారనే అంచనాలున్నాయి. దీంతో ఆయన విదిశ లోక్‌సభ స్థానం నుంచి పోటీ పడుతున్నారు.