దేశం కాంగ్రెస్ సొత్తా?

06-05-2024 01:18:51 AM

ముస్లింలను పాన్ మసాలాలా వాడుకున్నారు

అమేథీ, రాయ్‌బరేలీ సొంత ఆస్తి అనుకొంటున్నారు

కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకులా చూసింది

దేశమంతా నా కుటుంబమే.. 

కాంగ్రెస్, ఎస్పీపై ప్రధాని మోదీ విమర్శలు

ఇటావా, మే 5: ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌పై విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ముస్లిం వర్గాలను కాంగ్రెస్ పాన్ మసాలా మాదిరిగా వాడుకుందని దుయ్యబట్టారు. కుటుంబ పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం తొలుత ప్రధాని మోదీ అయోధ్యలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూపీలోని ఇటావాలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రజలు ఈసారి వేసే ఓటు వచ్చే ఐదేళ్ల కోసం కాదని, 25 ఏళ్ల అభివృద్ధి కోసమని పేర్కొన్నారు. అందుకోసం తాను పునాది వేస్తున్నానని చెప్పారు. 

అవి వారి ఆస్తులా? 

కాంగ్రెస్,  సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఆ రాజవంశాల వారసత్వం ఏంటి? కార్లు, బంగళాలు, రాజకీయ అధికారం వారి వారసత్వం. కొందరేమో మణిపురి, కన్నౌజ్, ఇటావా వారి ఆస్తి అనుకుంటారు. మరికొందరేమో అమేథీ, రాయ్‌బరేలీని వారి సొత్తు అనుకుంటారు. కానీ మోదీ మాత్రం అలా కాదు.. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడమే ఆయన ఆస్తి.. తల్లలు, బిడ్డలకు మరుగుదొడ్లు నిర్మించడమే ఆయన ఆస్తి.. దళితులు, వెనుకబడిన తరగతుల వారికి కరెంట్, గ్యాస్, నీరు అందించడం.. ఉచితంగా రేషన్ అందించడం మోదీ ఆస్తి.. మోదీ వారసత్వం అందరిది.. మోదీ వారసత్వం అందరి కోసం’ అని అన్నారు.

కొవిడ్ వ్యాక్సిన్‌పై దుష్ప్రచారం

కొవిడ్ వ్యాక్సిన్‌పై ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధాలు చెప్తున్నాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. రహస్యంగా వారందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని, టీవీలు, సోషల్ మీడియాలో లేనిపోని అబబ్ధాలు చెప్తున్నారంటూ మండిపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి కూడా ప్రతిపక్షాలుఅబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఎందుకంటే వారి బుజ్జగింపు రాజకీయాలను బట్టబయలు చేశాననే భయంతో ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదని రాజ్యాంగం రాసిన వారే చెప్పారని, కానీ ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ వాళ్లు మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ దుయ్యబట్టారు. కర్ణాటకలో రాత్రికి రాత్రి ఓబీసీల జాబితాలో ముస్లింను చేర్చి వారికి రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు.  

ఎస్పీపై విమర్శనాస్త్రం..

సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ వర్గాన్ని కాపాడుతున్నామంటూ సమాజ్‌వాదీ పార్టీ చెబుతున్న దాంట్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. ఎస్పీ కేవలం వారి కుటుంబానికి లేదా వారి ఓటు బ్యాంకు కోసమే ఏదైనా చేస్తుందని దుయ్యబట్టారు.  

గుళ్లకు ఎందుకు వెళ్లట్లేదు?

రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ ప్రశ్నల వర్షం సంధించారు. 5 ఏళ్ల కింద రాహుల్ గాంధీ బయటకు కనిపించేలా జంజం వేసుకున్నారని, గుళ్లకు తిరిగారని, అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం గుళ్లకు కూడా వెళ్లట్లేదని ఎద్దేవా చేశారు. జంజం కూడా తీసేశారని దుయ్యబట్టారు.  

కృష్ణుడిని తిట్టేవారితో మీకేం పని?

ద్వారకలో తాను పూజలు చేస్తే ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నేతలతో యధువంశీయులని చెప్పుకొనే వారికేం పని అంటూ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను ప్రశ్నించారు. అలాంటి వారితో ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు యూపీలో మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడేవారని, కానీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చాక ఆ పరిస్థితులు మారాయని తెలిపారు.