16-10-2025 01:56:31 AM
-బీసీ కోటాపై కాంగ్రెస్ తీరు ఐదు రకాలు
-ఇండియా, ఎన్డీఏ కలిస్తే బిల్లు వెంటనే పాస్ అవుతుంది
-రిజర్వేషన్ అంశాన్ని మోదీ దగ్గరికి తీసుకెళ్తే మేమూ మద్దతు ప్రకటిస్తాం: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
-18న బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు
-ప్రజా పోరాటాలతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యం: ఎంపీ ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని, అది చిత్తశుద్ధి లేని శివపూజలేల వంటిదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదని.. ఆ పార్టీ బీసీ రిజర్వేషన్ల పైన ఐదు రకాలుగా మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్డినెన్స్, బిల్లు ద్వారా, మరోసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు వస్తాయని చెబుతూ బీసీ ల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.. అనేక రకాలుగా మాటలు మార్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మద్దతు కోరుతూ బీసీ సంఘాల నేతలు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల ప్రతినిధులతో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నన్ని రోజులు ఆయన నాయకత్వంలో బీసీ రిజర్వేషన్లు అమలుకావన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాల ప్రతి ప్రయత్నాన్ని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున సపోర్ట్ చేస్తామని, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బలహీనవర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటామని పేర్కొన్నారు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటి పైనా నిలదీయాలని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీ, మోదీ ఇద్దరూ కలిసి ఒక్క మాట అంటే నిమిషంలో బీసీ రిజర్వేషన్ల అంశం తేలిపోతుందని, ఇండియా, ఎన్డీఏ కూటములు కలిసి నిర్ణయం తీసుకుంటే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుందని తెలిపారు. రిజర్వేషన్ అంశాన్ని మోదీ దగ్గరికి తీసుకెళ్తే తామూ మద్దతు ప్రకటిస్తాం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమం మాదిరే, సమస్యను ఢిల్లీ దాకా తీసుకువెళ్లి బీసీ రిజర్వేషన్లను సాధించుకుందామని సూచించారు. 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్‌కు బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
పోరు ఆగదు: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. మాయమాట లను ఎవరైనా నమ్మి వెనక్కి పోతే వారిని క్షమించవద్దని హెచ్చరించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఏ పోరాటానికి అయినా మేం సిద్ధమన్నారు.
జంతర్ మంతర్ వద్ద ధర్నా కాకుండా ప్రధానమంత్రి ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేస్తే వస్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. బీసీలకు బీఆర్‌ఎస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం గట్టిగా పోరాడితే కలిసి రావడానికి బీఆర్‌ఎస్ సిద్ధమన్నారు.
కాంగ్రెస్ మోసం చేస్తున్న విషయం తెలిసి కూడా ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడటం లేదన్నారు. నిఖార్సుగా నిలబడి కోట్లాడదామంటే అగ్గి పుట్టిస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేలను తిరగనివ్వకుండా చేస్తామని హెచ్చరించారు. కేబినెట్‌లో ఖాళీ ఉన్న మూడు స్థానాలను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూకంపం పుట్టిస్తేనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 2006లోనే కేసీఆర్ బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపారని, ఆనాడు కేసీఆర్ ఇచ్చిన బంద్‌లో పిలుపులో కూడా తామంతా పాల్గొన్నామని గుర్తు చేశారు.
ప్రజా పోరాటాలతో బీసీ రిజర్వేషన్లు సాధ్యం : ఎంపీ. ఆర్ కృష్ణయ్య
ప్రజాపోరాటలతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. అందుకు బీసీలంతా సంఘటితంగా ఉద్యమించాల్సిన తరుణం ఆసన్న మైందని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలు బలంగా జరిగినప్పుడే ప్రభుత్వాలు దిగొచ్చిన పనిచేస్తాయన్నారు. బీసీ బంద్ ఉద్య మంతో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వానికి సెగ తగలాలని అన్నారు. రిజర్వేషన్లలో మా వాటా కోసం పోరాటం చేస్తున్నామని, ప్రతి పార్టీ దానిని గుర్తించాలని విజ్ఙప్తి చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. సామాజిక సామరస్యం దెబ్బతినకుండా ముందుకెళ్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాం లో కేసీఆర్ ముందుచూపుతోనే బలహీలన వర్గాలకు మేలు జరిగిందని గుర్తు చేశారు.
సంతోషకరం: జాజుల శ్రీనివాస్‌గౌడ్
2006లో బీసీ సంఘాలు తలపెట్టిన సికింద్రాబాద్‌లో రైల్‌రోకోకు కేసీఆర్ హాజరై మద్దతు తెలిపారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు. ప్రస్తుతం బీసీలు తలపెట్టిన బీసీ బంద్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ప్రకటించడం సంతోషకరమన్నారు. 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు వెనుకడుగు వేసేది లేదన్నారు. పర్యాద కృష్ణమూర్తి, బెల్లి సిద్ధయ్యతో కమిటీ వేసి బీసీల స్థితిగతులపై అధ్యయనం చేయాలని సూచించారని గుర్తు చేశారు. ఆ కమిటీ నివేదిక మేరకు 44 శాతం బీసీ రిజర్వేషన్లు కావాలని గట్టిగా కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు.