10-05-2025 03:50:41 PM
-వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు పైల్ల ఆశన్న-
మందమర్రి: విజయక్రాంతి: కేంద్రంలోని మోడీ సర్కార్ 29 కార్మిక చట్టాలు రద్దుచేస్తూ నాలుగు కోడ్స్ గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు పైల్ల ఆశన్న కోరారు. ఏరియా లోని ఆర్కేపీ సీహెచ్పిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశ వ్యాప్త సమ్మెలో రైతులు, వృత్తి సంఘాల వారితో పాటు పెద్ద ఎత్తున అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొని మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కనీస వేతన చట్టం అమలు, 8గంటల పని దినం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటికరణకు వ్యతిరేకంగా జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మె ను కార్మిక వర్గం విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామిలు మాట్లాడుతూ... సింగరేణి సంస్థకే కొత్త గనులు కేటాయించాలని, వేలం పాటల విధానంను కేంద్ర ప్రభుత్వ వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
శ్రావణపల్లి బ్లాక్ ను సింగరేణి సంస్థకే కేటాయించా లని, ఓపెన్ కాస్టుల పేరుతో సింగరేణిని అమ్మితే సింగరేణి కార్మిక వర్గం తీవ్రంగా పోరాడుతుందని కేంద్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి ప్రైవేటీకరణ నిలిపి వేయాలని వారు హితవు పలికారు. కొత్త లేబర్ కోడ్స్ లో పర్యవేక్షణ అధికారులకు అధికారాలు తగ్గించారని, ఫైర్ విధానాన్ని ప్రవేశపెట్టి కార్మికులను నిర్దాక్షిణ్యంగా తీసివేసే విధానాన్ని తీసుకు వస్తున్న విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా వ్యతిరేకించాలని కోరారు .కార్మిక సంఘాలు ఇచ్చే సమ్మె పిలుపులో భాగంగా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి నిరసనలు తెలుపాలని కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమం లో బ్రాంచ్ ట్రెజరర్ వడ్లకొండ ఐలయ్య, నాయకులు అలవాల సంజీవ్, పంగ మల్లేష్, ఎండి అమీర్, జోరుక వెంకటేష్, ఆయిందాల శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.