తహసీల్దార్ కార్యాలయంలో వివాదాలు
- వాట్సప్‌లో లంచాల ఆరోపణలు వైరల్
- బెజ్జంకి కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
బెజ్జంకి, ఆగస్టు 18 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల తహశీల్దార్ కా ర్యాలయం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. కార్యాలయంలో లంచాల బాగో తం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సోమవారం ఓ మహిళ తన పిల్లలతో కలిసి కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల ఓ వ్యక్తి తన పని పూర్తి కావాలంటే లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపిస్తూ వాట్సాప్లో పోస్ట్ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
తాను ఇచ్చిన డబ్బులకు సంబంధిం చిన ఆధారాలను త్వరలోనే బయటపెడతానని ఆ పోస్టులో పేర్కొనడం అధికారుల పని తీరుపై అనుమానాలకు తావిచ్చింది. ఈ వి వాదం సద్దుమణగకముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన వారసత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు న్యాయం చేయాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదని ఆరోపించిన ఆమె, విసుగు చెంది తన పిల్లలతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు వెంటనే అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవైపు లంచాల ఆరోపణలు, మరోవైపు భూ వివాదాలపై రెవెన్యూ అధికారుల వ్యవహారశైలిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






