calender_icon.png 23 January, 2026 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదప్రజల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం

23-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

గాంధారి, జనవరి 22 (విజయక్రాంతి): పేద ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఈ మేరకు గురువారం రోజున గాంధారి మండలంలోని చెన్నాపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం చాలా వెనుకబడిందని, గత 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు కాలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి, తొలి విడతలో 3,500కు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రెండో విడతలో వచ్చే ఏప్రిల్ నెలలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.అలాగే చెన్నాపూర్ ప్రభుత్వ పాఠశాల మరమ్మతులు మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చెన్నాపూర్ గ్రామ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, అధికారులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే భూభారతి చట్టం

గాంధారి, జనవరి 22 (విజయ క్రాంతి): రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే భూభారతి చట్టం అని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. ఈ మేరకు గురువారం రోజున గాంధారి మండలం చెన్నాపూర్ గ్రామంలో భూభారతి చట్టం కింద చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా  నిర్వహించిన  గ్రామ సభలో  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్  భూభారతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్గా చెన్నాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసి, గ్రామ పరిధిలోని మొత్తం 506 ఎకరాల భూములను రీసర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.

భూభారతి చట్టం ద్వారా రైతుల భూములకు సంబంధించిన గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ, నిజమైన భూ యజమానుల పేర్లను అధికారికంగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ధరణి పోర్టల్ అమలుతో అనేక మంది రైతులు భూములు కోల్పోయారని, తప్పుడు సర్వే నంబర్ల కారణంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని పరిస్థితులు ఎదురయ్యాయని విమర్శించారు.

భూముల సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎంఆర్‌ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ధరణి వ్యవస్థలోని లోపాలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా, ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల భూ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వివరించినట్లు తెలిపారు. 

స్పందించిన ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా ప్రతీ రైతు భూమిని రీసర్వే చేయాలని నిర్ణయించడంతో, పైలట్ ప్రాజెక్ట్గా చెన్నాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.ఈ కీలక నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి ఆర్డిఓ పార్థసారథి, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్వర్, గాంధారి తహసిల్దార్ రేణుక చౌహన్ తో పాటు మండల అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.