calender_icon.png 19 November, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ అండ్ బి అధికారుల ఆచూకీ చెబితే.. సన్మానం చేస్తాం!

19-11-2025 05:40:48 PM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ వ్యంగాస్త్రం

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రోడ్లు, భవనాల శాఖ అధికారులు కనిపించడం లేదని, ఆచూకీ తెలిపిన వారికి ఘనంగా సన్మానం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ వ్యంగస్త్రం విసిరారు. భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలోని కాటారం, మహాదేవపూర్ 353 సి జాతీయ రహదారి పరిధిలో ఉన్న రోడ్లు సైతం రైలు పట్టాల మాదిరిగా గాడీలు ఏర్పడి అనేక ప్రమాదాలతో పాటు పలువురు మృత్యువాత పడ్డ విషయాన్ని ఈ సందర్భంగా శ్రీకాంత్ గుర్తు చేశారు. అలాగే మలహర్, పలిమెల, మహా ముత్తారం, కాటారం, మహదేవపూర్ మండలాల అంతర్గత రహదారులు పూర్తిగా అద్వానంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళలో రాజకీయ విభేదాలు విస్మరించి పల్లెల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి రాజకీయ పార్టీలు కృషి చేయాలని ఆయన హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా మొగుళ్ళపల్లి, చిట్యాల, టేకుమట్ల తదితర మండలాలలో కూడా రోడ్లు చిన్నాభిన్నమై వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందిగా ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక దఫాలుగా ఆర్ అండ్ బి అధికారుల కార్యాలయాలకు వెళ్లినప్పటికీ సంబంధిత శాఖలో సదరు అధికారుల జాడ కానరావడం లేదని శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ద్వజ మెత్తారు.  రోడ్ల అద్వాన పరిస్థితులపై అనేకసార్లు పత్రికలు, మీడియాలలో అనేక కథనాలు వెలువడినప్పటికీ సంబంధిత శాఖ అధికారులలో ఎలాంటి చలనం లేకపోవడం శోచనీయమని శ్రీకాంత్ పేర్కొన్నారు.

రోడ్లను బాగు చేయడానికి అధికారులు ఎందుకు తాశ్చర్యం చేస్తున్నారో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం నిధులను వెచ్చించి ప్రజల కోసం ఏర్పాటుచేసిన రోడ్ల నిర్మాణాలు, మరమ్మతు పనులను పూర్తి చేయకుండానే సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు మామూళ్లకు ఆశపడి, కాంట్రాక్టర్లతో కుమ్మక్కైనట్టుగా శ్రీకాంత్ ఆరోపించారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టకుండా, అధికారులు పర్యవేక్షణ చేయకుండా బాధ్యతను విస్మరించడం ఆర్ అండ్ బి అధికారులకు తగదని, అధికారుల్లో మార్పు రాకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని శ్రీకాంత్ హెచ్చరించారు. ఆర్ అండ్ బి అధికారులను ఆఫీసులకు పట్టుకొని తీసుకొచ్చిన వారికి సన్మానం చేస్తామని శ్రీకాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.