calender_icon.png 19 November, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ వాతావరణంలా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ నిర్వహించాలి

19-11-2025 06:32:36 PM

అర్హులైన మహిళలకు అందజేయాలి

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి పంపిణీపై బుధవారం హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. సీతక్క, వాకిటి శ్రీహరి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని దాదాపు కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా "మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి" ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పేరిట చీరలను పంపిణీ చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులకు, అలాగే 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణాల్లో 35 లక్షల చీరల చొప్పున మొత్తం దాదాపు కోటి చీరలను పంపిణీ చేస్తామని చెప్పారు. దీనికి తగ్గట్టు అధికారులు తగు కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఈ చీరల వల్ల ఆత్మగౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.

నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి, చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. అధికారులను, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.  మహిళల అభ్యున్నతి ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని సీఎం తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుందని వివరించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణతో పాటు అనేక రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా, వారిని బస్సులకు యజమానులు చేయడానికి అద్దె బస్సులను కేటాయిస్తున్నామని చెప్పారు. 2034 సంవత్సరం నాటికి, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు.    

చీరల పంపిణీకి ప్రణాళిక

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇందిరా మహిళా చీరల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. నియోజకవర్గానికి, మండలానికి, గ్రామానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాలకు చీరలు తరలించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వివరాలు సేకరించి, అర్హులైన మహిళలకు చీరలు ఇవ్వాలని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ శేషాద్రి, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, డీపీఓ శర్ఫుద్దిన్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వేములవాడ మున్సిపల్ మేనేజర్ సంపత్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్,  తదితరులు పాల్గొన్నారు.