19-11-2025 06:44:08 PM
మిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూత
వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన సయ్యద్ ఫయాజ్ గత నెలలో మృతిచెందగా.. ఈ నేపథ్యంలో ఫయాజ్ కుటుంబానికి తోడు నిలుస్తూ, అతనితో చదువుకున్న శ్రీ అరవింద విద్యామందిర్ ములుగు 2003–04 పదవ తరగతి బ్యాచ్‌కి చెందిన 80 మంది బాల్యమిత్రులు కలిసి మొత్తంగా రూ.1,08,000 లను సేకరించారు. ఈ మొత్తాన్ని ఫయాజ్ చిన్న కుమార్తె పేరుతో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో జమ చేశారు. అలాగే ఫయాజ్ మిత్రుల అభ్యర్థన మేరకు వేదవ్యాస హై స్కూల్ కరస్పాండెంట్ పోశాల వీరమల్లు ఫయాజ్ ఇద్దరు పిల్లలకు ఈ విద్యా సంవత్సరానికి స్కూల్ ఫీజును మాఫీ చేశారు.
పాలంపేట నుండి వెంకటాపూర్ పాఠశాలకు వెళుతున్న పిల్లల కోసం వ్యాన్ ఫీజు రూ.10,000 లను మరో మిత్రుడు దుగ్గిరెడ్డి సురేందర్ రెడ్డి భరించారు. పదవ తరగతి పూర్తి అయ్యి 21 సంవత్సరాలు గడిచినప్పటికీ, మిత్రత్వాన్ని చిరస్థాయిగా నిలబెట్టుకుంటూ ఫయాజ్ కుటుంబానికి చేయూతనందించిన మిత్రబృందానికి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మిత్రులకు ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు తమ వంతు సహాయాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, ఏ కార్యక్రమం చేపట్టినా నమ్మకంతో, ఐక్యతతో సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రులు మలిశెట్టి స్వాతి, సిరివెన్నెల, అన్నం మోహన్ కుమార్, దేవరాజ్, విక్రమ్ రాజ్, తిరుపతి, రాజన్న, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.