calender_icon.png 19 November, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

19-11-2025 07:00:06 PM

అమరావతి: రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేసింది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు  పాల్గొన్నారు. అదే వేదికపై నుంచే అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ పథకం కింద రెండో విడత నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రెండో విడతగా రూ.7 వేల చొప్పున 46,85,838 రైతుల ఖాతాలతో రూ.3200 కోట్ల పెట్టుబడి సాయం జమ చేశారు. రెండు విడతల్లో రూ.14 వేలను రైతుల ఖాతాలకు జమ చేసిన ఏపీ ప్రభుత్వం కేవలం 4 నెలల కాలంలోనే రూ.6309.44 కోట్ల మేర అన్నదాతలకు ఆర్ధిక ప్రయోజనం కల్పించింది. 

పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి రైతులతో కలిసి గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలు ఇస్తే, నాడు ఎగతాళి చేసారని, మాట ఇచ్చినట్టే 17 నెలల్లోనే సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసామన్నారు. గత ప్రభుత్వం లాగా బటన్ నొక్కుడు డ్రామాలు లేవని, రియల్ టైం గవర్నెన్స్ లో రియల్ టైంలోనే రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేశామని ఆయన తెలిపారు. సాగు తీరు మారాలి.. వ్యవసాయం లాభసాటి కావాలి.. అన్నదాత బ్రతుకు మారాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. దీని కోసం అనేక కార్యక్రమాలతో రాష్ట్ర రైతాగానికి ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా కల్పించారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి కాబట్టే రైతులకు మేలు జరుగుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.