19-11-2025 06:33:40 PM
చెన్నై: దేశ రైతాంగానికి చేయుతనందిస్తూ పెట్టుబడి సాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 21వ విడత పీఎం కిసాన్ నిధులను బుధవారం విడుదల చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సేంద్రీయ వ్యవసాయం, పంటల వైవిధ్యం, ఎరువుల వాడకం వంటి వ్యవసాయ అంశాలపై ఆయన మాట్లాడారు. తమిళనాడు రైతులు సహజ వ్యవసాయంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ, ఒక ఎకరం, ఒక సీజన్ పై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ కోరారు.
పంటల వైవిధ్యం, సేంద్రీయ వ్యవసాయం నేల సంబంధిత సమస్యలకు పరిష్కారాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రశంసిస్తూ భారతదేశం సేంద్రీయ వ్యవసాయానికి ప్రపంచ కేంద్రంగా మారే మార్గంలో ఉందని ప్రధాని మోదీ తెలిపారు.ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం గురించి మోడీ ప్రస్తావిస్తూ నేను పోడియం వద్ద ఉన్నప్పుడు, నా సోదరులు చాలా మంది తమ గాంచాలను తిప్పుతున్నట్లు గమనించాను.
ఆ క్షణంలో నేను రాకముందే బీహార్ స్ఫూర్తి వచ్చిందని నేను అనుకున్నాను. ప్రసంగానికి ముందు, ప్రధాని మోదీ పీఎం-కిసాన్(PM-KISAN) 21వ విడతగా రూ.18,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. ఈ విడత దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు మద్దతు ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏటా మూడు సమాన వాయిదాలలో రూ.6,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని మోదీ వెల్లడించారు. కోయంబత్తూరుకు రాకముందు, మోడీ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.