19-11-2025 06:20:40 PM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..
కల్వకుర్తి: పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కల్వకుర్తి, చారగొండ మండలాలకు చెందిన 67 మంది లబ్ధిదారులకు శాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేస్తోందని చెప్పారు.
ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పేదలకు అండగా నిలిచే విధానాలు చేపట్టడం కాంగ్రెస్ పార్టీ విధేయతలో భాగమని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ జనార్దన్ రెడ్డి, ఎమ్మార్వో ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, సంజీవ్ యాదవ్, అశోక రెడ్డి, రమాకాంత్ రెడ్డి, దామోదర్ గౌడ్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు, అనంతరం క్యాంప్ కార్యాలయంలో కల్వకుర్తి ,వెల్దండ , చారకొండ మండలాల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై చర్చించారు.