ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలో మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్(District Collector Satya Prasad) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఎరువుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఎరువుల దుకాణం ముందు సూచిక బోర్డు తప్పనిసరి ఉంచాలని, సూచిక బోర్డుపై ఎరువులు, మందులు, విత్తనాల ధరల పట్టికలో ధరలు రాయాలని, రైతులకు సరైన ధరలకు అమ్మాలని సూచించారు.
అదే విధంగా రైతులకు ఎరువులు విత్తనాలు నాణ్యతమైనవి అందించాలని, కాలం చెల్లిన(ఎక్స్పైర్) మందులను రైతులకు అమ్మరాదని పేర్కొన్నారు. ఎరువులు, స్ప్రే మందులు సరైన ధరలకు అమ్మాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులతో ఒక ఎకరానికి ఎంత ఎరువులు వేస్తున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన మందులు ఇస్తున్నారా...అని అడిగి తెలుసుకున్నారు. దుకాణదారు రైతులకు నాణ్యతలేని ఎరువులు, మందులు, విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్, మండల వ్యవసాయ అధికారి వినీల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






