calender_icon.png 29 January, 2026 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో సజావుగా సాగుతున్న నామినేషన్ల ప్రక్రియ

29-01-2026 03:38:25 PM

రామగుండం, జనవరి 29(విజయక్రాంతి): పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జిల్లాలో సజావుగా కొనసాగుతుందని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ రామగుండం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముబారక్ నగర్, సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్  రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 60 డివిజన్ లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం రామగుండంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశామని, పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు. 

 జనవరి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, జనవరి 31న  నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి  సరిగ్గా  నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. నామినేషన్ తిరస్కరించిన అభ్యర్థులు  ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటల వరకు అప్పిల్ చేసుకునే అవకాశం ఉందని, సదరు అప్పీల్స్ ను ఫిబ్రవరి 2న పరిష్కరిస్తామని, ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 3 సాయంత్రం పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.